ఆంధ్ర ప్రదేశ్‌లో వచ్చే విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల ప్రవేశం కోసం నిర్వహించనున్న ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. వేసవికాలంలో వరుసగా ఎప్రిల్, మే నెలల్లో వీటిని నిర్వహించనున్నట్లు మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ రావు వెల్లడించారు.  

విజయవాడలో విద్యా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ...ఈ సారి అన్ని పరీక్షలు కూడా ఆన్ లైన్ లోనే  నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగాప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఆయన విడుదల చేశారు. 

మొదట ఏప్రిల్ 19 వ తేదీన ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈసెట్), ఏప్రిల్ 20 నుండి  22వ తేదీ వరకు ఎంసెట్ (ఇంజనీరింగ్), ఏప్రిల్‌ 24న ఎంసెట్‌(అగ్రికల్చర్‌), ఏప్రిల్‌ 26న  ఇంటిగ్రిటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఐసెట్‌) నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇక మే 1 నుండి 4 వరకు పీజిసెట్( పోస్ట్ గ్రాడ్యుయేషన్  ఎంట్రన్స్ టెస్ట్), మే 6న లాసెట్, ఎడ్‌సెట్, మే 8 నుంచి 15 వరకు పీఈసెట్‌ పరీక్షలు నిర్వహిస్తామని గంటా వివరించారు.