Russia Ukraine war: రష్యాతో చర్చలు విఫలమైతే మూడో ప్రపంచ యుద్ధమేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ హెచ్చరించారు. తాను చర్చలకు సిద్ధమేనని.. ఈ సారి పుతిన్‌తో జరిగే చర్చలు విఫలమైతే.. ఇక మూడో ప్రపంచ యుద్ధమే అని అన్నారు. గత రెండు ఏండ్లుగా చర్చలకు తాను సిద్ధంగానే ఉన్నానని జెలెన్‌స్కీ తెలిపారు.
Russia Ukraine war: ఉక్రెయిన్‌పై రష్యా దాడిని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా విమర్శిస్తోంది. ఉక్రెయిన్ ఆక్రమించాలనే కాంక్షతో రష్యన్ సేనలు దాష్టీకానికి పాల్పడుతున్నారు. ఇప్పటికే పలు నగరాలను పుతిన్ సైన్యం ధ్వంసం చేసి.. ఆక్రమించాయి. యుద్ధం విషయంలో పుతిన్ తీరును అంతర్జాతీయ సమాజం ఎంతగా తిట్టిపోస్తుంది. ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షాలు విధిస్తూ.. పుతిన్ జోరుకు కళ్లెం వేయాలని ప్రయత్నిస్తోన్నాయి.
ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఆదివారం అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ..రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరపడానికి తాము సిద్దంగానే ఉన్నామని.. ఒక వేళ చర్చలు విఫలమైతే.. తదనంతర పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చని జెలెన్‌స్కీ ఆందోళన వ్యక్తం చేశాడు. గత రెండేళ్లుగా చర్చలకు తాను సిద్ధంగానే ఉన్నానని.. చర్చలు జరుగకుండా.. సంధి కాకుండా మరో మార్గంలో యుద్ధం ముగుస్తుందని అనుకోవడం లేదని జెలెన్‌స్కీ అన్నారు.
ఈ నేపథ్యంలో ఏదో విధంగా పుతిన్‌తో తాను చర్చలు జరుపాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ ప్రయత్నాలు విఫలమైతే మూడో ప్రపంచ యుద్ధం తప్పకపోవచ్చని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించినట్లు సీఎన్‌ఎన్ పేర్కొంది. చర్చలు ఏలా జరిగిన జరిగినా పర్వాలేదు. కానీ, పుతిన్‌తో నేరుగా మాట్లాడాలని కోరుకుంటున్నాననీ, చర్చలు విఫలం అయితే.. మాత్రం మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనట్టేననీ జెలెన్‌స్కీ అభిప్రాయపడ్డాడు. అయితే ఆ యుద్ధం తీరు తెన్నులపై స్పందించేందుకు మాత్రం జెలెన్‌స్కీ విముఖత వక్తం చేశాడు.
మరోవైపు.. యుద్దం ప్రారంభమై.. ఆదివారం నాటికి 25వ రోజులు కావస్తోంది. అయితే ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 14,700 మంది రష్యా సైనికులు హతమైనట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ క్రమంలో 96 రష్యా యుద్ధ విమానాలు, 118 హెలికాప్టర్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. అలాగే.. 1,487 సాయుధ వాహనాలు, 947 సైనిక వాహనాలు, 476 ట్యాంకులు, 74 ఎంఎల్‌ఆర్‌లు, 60 ట్రక్కులు, 44 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ వ్యవస్థలు, 21 యూఈవీలను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది.
కాగా, యుద్ధం నేపథ్యంలో సుమారు పది లక్షల మంది ప్రజలు ప్రాణాలు అరిచేతలో పట్టుకుని.. ఉక్రెయిన్ సరిహద్దులు దాటినట్టు ఐక్యరాజ్య సమితి నివేదికలు తెలుపుతున్నాయి. అనేక మంది అమాయక పౌరులు శరణార్థులుగా మారుతున్నారని, వేల కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టు యూఎన్‌హెచ్‌సీఆర్ వెల్లడించింది.
