ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్‌పై (Zaporizhzhia nuclear power plant) రష్యా సైనికుల దాడితో మంటలు చెలరేగాయని ఎనర్‌దోహర్ మేయర్ చెప్పారు. తాజా పరిణామాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelenskyy) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా Chernobyl విపత్తును పునరావృతం చేయాలని చూస్తోందని ఆరోపించారు.
ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్‌పై (Zaporizhzhia nuclear power plant) రష్యా సైనికుల దాడితో మంటలు చెలరేగాయని ఎనర్‌దోహర్ మేయర్ చెప్పారు. దీంతో ఎలాంటి విపత్తు ఎదుర్కొవాల్సి వస్తుందో అని ఉక్రెయిన్ ప్రజలలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ అణు విద్యుత్ ప్లాంట్ యూరప్‌లో అతి పెద్దది. ఈ అణు విద్యుత్‌పై రష్యా సైనికులు అన్ని వైపుల నుంచి కాల్పులు జరిపినట్టుగా ఉక్రెయిన్ వర్గాలు తెలిపారు. ఈ క్రమంలోనే అణు విద్యుత్ ప్లాంట్‌పై దాడులు ఆపాలని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా.. రష్యా సైనికకులను కోరారు.
జాపోరిజ్జియా ప్లాంట్‌ను పేల్చి వేస్తే విపరీతమైన నష్టం సంభవిస్తుందని మంత్రి చెప్పారు. జపోరిజ్జియా అణువిద్యుత్ ప్లాంట్ పేలితే, దీని ప్రభావం చెర్నోబిల్ కంటే 10 రెట్లు అధికంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక, రష్యా దాడుల తర్వాత జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్‌లోని పవర్ యూనిట్‌లో మంటలు చెలరేగాయని ఉక్రెయిన్ అధికార ప్రతినిధి ఆండ్రీ తుజ్ తెలిపారు. ఆగ్నేయ ఉక్రెయిన్‌లోని పారిశ్రామిక నగరమైన జపోరిజ్జియా వద్ద ఉన్న ఈ స్టేషన్ దేశం యొక్క అణుశక్తిలో 40 శాతం సరఫరా చేస్తుంది. 1986 చెర్నోబిల్ విపత్తు జరిగిన ప్రదేశంతో సహా ఉక్రెయిన్ అణు కేంద్రాలపై అన్ని చర్యలను నిలిపివేయాలని UN యొక్క అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇప్పటికే రష్యాను కోరింది.
జాపోరిజ్జియా అణు విద్యుత్ కేంద్రం నుంచి మంటలు చెలరేగిన నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelenskyy) స్పందించారు. రష్యన్ దళాలు అణు విద్యుత్ ప్లాంట్‌పై బాంబు దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. ఇది చెర్నోబిల్ కంటే 6 రెట్లు పెద్దది కాబట్టి పేలితే పెనుప్రమాదం తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. మాస్కో అణు టెర్రర్‌ను ఆశ్రయించిందని.. చెర్నోబిల్ విపత్తును పునరావృతం చేయాలని చూస్తోందని జెలెన్స్కీ ఆరోపించారు.
‘రష్యా తప్ప మరే దేశం అణు విద్యుత్ యూనిట్లపై కాల్పులు జరపలేదు. మానవజాతి చరిత్రలో చరిత్రలో ఇదే మొదటిసారి. ఉగ్రవాద రాజ్యం ఇప్పుడు అణు టెర్రర్‌ను ఆశ్రయించింది’ అని జెలెన్ స్కీ ఓ వీడియోలో చెప్పారు.
జాపోరిజ్జియా అణు విద్యుత్ కేంద్రంపై రష్యన్ సేనలు దాడులకు పాల్పడిన క్రమంలో యూఎస్, యూకేలు ఆందోళనలు వ్యక్తం చేశాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీతో బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఫోన్లో మాట్లాడినట్లు యూకే ప్రభుత్వం తెలిపింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్లక్ష్యపూరితమైన దాడులు ఇప్పుడు ఐరోపా మొత్తం భద్రతకు ముప్పుగా మారాయని పేర్కొంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా జెలెన్ స్కీతో మాట్లాడారు. తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. న్యూక్లియర్ ప్లాంట్ సమీపంలో కాల్పుల విరమణ చేయాలని, అగ్నిమాపక దళాలు, అత్యవసర స్పందన దళాలను అనుమతించాలని రష్యాను కోరినట్లు వైట్ హౌస్ తెలిపింది.
