యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని అభా విమానాశ్రయం లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎయిర్ పోర్ట్ లో ఆగి ఉన్న ఓ పౌర విమానంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. 

ఈ మంటల దాటికి విమానం స్వల్పంగా దెబ్బతిన్నది. అయితే ఎవరికీ ఎలాంటి హానీ జరగకపోవడంతో విమానాశ్రయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇప్పటికే హౌతీ తిరుగుబాటుదారులు అభా విమానాశ్రయం మీద పలుమార్లు డ్రోన్లు, క్షిపణులతో దాడికి పాల్పడ్డారు.

ఈ దాడుల్లో చాలామంది గాయపడ్డారు కూడా. కానీ, తొలిసారి తిరుగుబాటుదారుల దాడి వల్ల ఓ విమానంలో మంటలు అంటుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సౌదీ మీడియా సమాచారం ప్రకారం మంటలు చెలరేగిన విమానం ఎయిర్ బస్ ఏ320గా తెలిసింది. 

ఈ ఘటనలో విమానాల ట్రాకింగ్ కు అంతరాయం కలగడం వల్ల విమాన సర్వీసుల రాకపోకలు ఆలస్యం అవుతున్నట్లు అధికారులు తెలిపారు. 2017 నవంబర్ లో కూడా ఇలాగే హౌతీ తిరుగుబాటు దారులు రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.