రష్యా తమపై చేస్తున్న యుద్ధంలో తమకు సహకరించాల్సిందిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌‌స్కీ పిలుపు ఇచ్చారు. ఈ పిలుపును అందుకుని ప్రపంచంలోనే మేటి షూటర్ వాలి కదనరంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. రాయల్ కెనెడియన్ 22వ రెజిమెంట్‌కు చెందిన వాలి ఉక్రెయిన్ సేనలతో కలిసి పోరాడనున్నారు. 

న్యూఢిల్లీ: ఆయన ప్రపంచంలోనే పేరుపొందిన స్నైపర్. అన్ని కుదిరితే ఒక్క రోజులో 40 మందిని షూట్ చంపేయగల ధీరుడు. సాధారణంగా గుడ్ స్నైపర్ అంటే సగటున రోజులో ఐదు నుంచి ఆరుగురిని మట్టుబెడతారు. ఇంక ఏడు నుంచి పది మందిని హతమార్చారంటే వారు గ్రేట్ స్నైపర్‌గా పేర్కొంటారు. కానీ, రాయల్ కెనెడియన్ 22వ రెజిమెంట్‌కు చెందిన వాలి ఒక్క రోజులో ఏకంగా 40 మందిని చంపేయగలడు. అలాంటి వాలి ఇప్పుడు ఉక్రెయిన్‌ తరఫున కదనరంగంలో దూకాడు. రష్యా సేనలను మట్టుబెడతానని చెబుతున్నాడు.

రష్యాను ఎదుర్కోవడంలో తమకు సహకరించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ పిలుపు ఇచ్చారు. విదేశాలకు చెందిన యోధులు, ధీరులు రష్యాపై యుద్ధంలో తమతో కలిసి రావాలని కోరారు. ఈ పిలుపు ఆయనకు వైమానిక దాడులు జరిపేటప్పుడు అప్రమత్తత కోసం చేసే శబ్దంలా వినిపించిందని వాలి అన్నాడు. వెంటనే రెక్కలు కట్టుకుని ఉక్రెయిన్‌లో వాలాడు.

ఉక్రెయిన్‌కు తాను హెల్ప్ చేయాలని అనుకుంటున్నట్టు ఆయన ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అది చాలా సులువైన నిర్ణయం అని వివరించాడు. తాము రష్యన్‌లుగా కాదు.. యూరోపియన్లుగా ఉంటామని అంటున్నందుకే బాంబులతో చంపేస్తామంటే తాను ఒప్పుకోనని, వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు.

ప్రపంచంలో బెస్ట్ స్నైపర్‌గా వాలికి పేరు ఉన్నది. 40 ఏళ్ల ఈ ఫ్రెంచ్ కెనెడియన్.. కంప్యూటర్ సైంటిస్టు. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో ఆయన రెండు సార్లు అక్కడ సేవలు అందించారు. 2009, 2011 సంవత్సరాల్లో యుద్ధ కాలంలో ఆయన ఆఫ్ఘనిస్తాన్‌లో పని చేశాడు. అక్కడే ఆయన వాలి అనే పేరును పొందాడు. వాలి అంటే అరబిక్‌లో రక్షకుడు అని అర్థం.

వాలి ఒక కొడుక్కి తండ్రి. ఆయన రష్యాతో ఉక్రెయిన్‌లో తలపడుతుండగా అంటే.. వచ్చే వారంలో వాలి కుమారుడికి ఒక ఏడాది నిండనుంది.

ఇది ఇలా ఉండగా, ఉక్రెయిన్‌ పై యుద్ధం కారణంగా అమెరికా, పశ్చిమ దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కఠిన ఆర్థిక ఆంక్షలు అమలు చేస్తుండటంతో రష్యా తాజాగా, ఆ దేశాలకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. తమపై ఆంక్షలు విధిస్తే.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ముప్పు ఉందని, అది కూలిపోవచ్చని హెచ్చరించింది. అదే విధంగా ఒక అమెరికన్ వ్యోమగామి భవితవ్యం కూడా ప్రశ్నార్థకం అవుతుందని తెలిపింది. 

అమెరికా వ్యోమగామి మార్క్ వాన్‌డె హెయి అంతరిక్షం నుంచి మరో మూడు వారాల్లో భూమిపైకి తిరిగిరానున్నారు. అంతరిక్ష కేంద్రంలో ఆయన సుమారు ఏడాది పాటు గడిపారు. రష్యన్ వ్యోమనౌక పై ఆయన భూమి పైకి బయల్దేరనున్నారు. ఈ విషయాన్ని రష్యన్ స్పేస్ ఏజెన్సీ ప్రస్తావించింది. పశ్చిమ దేశాలు, అమెరికా విధిస్తున్న ఆంక్షల కారణంగా ఆయనను అంతరిక్ష కేంద్రంలోనే వదిలిపెట్టాల్సి రావొచ్చని, ఆ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూడా కూలిపోయే ముప్పు ఉందని, అదీ అమెరికాపై కూలిపోయే అవకాశాలూ ఉన్నాయని ఓ సోషల్ మీడియా పోస్టులో రష్యన్ స్పేస్ ఏజెన్సీ హెడ్ దిమిత్రి రొగోజిన్ హెచ్చరించారు.