గ‌తేడాది డిసెంబర్ 8న కోవిడ్‌-19 వ్యాక్సిన్ తీసుకున్న‌ ప్ర‌పంచంలోనే మొట్టమొదటి  పురుషునిగా షేక్‌స్పియర్ వార్త‌ల్లోకెక్కారు. 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతలా విలయతాండవం చేస్తుందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో అందరికీ కరోనా వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వాలు చేస్తున్నారు. ప్రస్తుతం అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. కాగా.. ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి తాజాగా కన్నుమూశారు.

ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా క‌రోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యక్తిగా చరిత్ర సృష్టించిన బ్రిట‌న్‌కు చెందిన‌ విలియం షేక్‌స్పియర్‌(81) అనారోగ్యంతో మృతిచెందారు. గ‌తేడాది డిసెంబర్ 8న కోవిడ్‌-19 వ్యాక్సిన్ తీసుకున్న‌ ప్ర‌పంచంలోనే మొట్టమొదటి పురుషునిగా షేక్‌స్పియర్ వార్త‌ల్లోకెక్కారు. యూనివర్సిటీ ఆస్ప‌త్రి కోవెంట్రీ అండ్‌ వార్విక్‌షైర్‌లో ఆయ‌న జ‌ర్మనీకి చెందిన బ‌యోఎన్‌టెక్‌, అమెరికా ఔష‌ధ సంస్థ‌ ఫైజర్ సంయుక్తంగా రూపొందించిన క‌రోనా టీకా తీసుకున్నారు. 

అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇదే ఆస్పత్రిలో చేరిన షేక్‌స్పియర్‌ ఈనెల 20న మృతిచెందినట్లు ఆయ‌న మిత్రుడు జైన్ ఇన్నేస్‌ వెల్ల‌డించారు. కాగా, షేక్‌స్పియర్ కంటే ముందు ఇదే ఆస్ప‌త్రిలో మార్గరెట్‌ కీనన్‌(91) క‌రోనా వ్యాక్సిన్ తీసుకుని మొట్టమొదటి వ్యక్తిగా(మ‌హిళ‌) రికార్డుకెక్కారు.