ఓ మహిళ సింగపూర్ నుంచి మంచుఖండం అంటార్కిటికాలోని కస్టమర్‌కు ఫుడ్ డెలివరీ చేశారు. ఇందుకోసం ఆమె సుమారు 30 వేలకు పైగా కిలోమీటర్ల ప్రయాణించారు. నాలుగు ఖండాల్లో ప్రయాణం చేశారు. ఈ జర్నీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
న్యూఢిల్లీ: ఓ మహిళ మన ప్రపంచంలోనే లాంగెస్ట్ ఫుడ్ డెలివరీ చేశారు. అంటార్కిటికాలోని తన కస్టమర్‌కు ఆమె సింగపూర్ నుంచి ఫుడ్ తీసుకెళ్లారు. ఇందుకోసం ఆమె సుమారు 30 వేల కిలోమీటర్లు దూరం వెళ్లారు. దాదాపు నాలుగు ఖండాలను చుట్టుతూ వెళ్లారు. ఈ జర్నీకి సంబంధించిన జర్నీని మానసా గోపాల్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్టు చేశారు.
ఒక ఫుడ్ ప్యాకెట్‌ను చేత పట్టుకుని 30,000 కిలోమీటర్లు చేసిన ప్రయాణంలో ప్రధాన మజిలీలను ఆమె తన వీడియోలో పేర్కొన్నారు. ఆమె సింగపూర్ నుంచి ప్రయాణం మొదలు పెట్టి హాంబర్గ్‌కు వెళ్లారు. అక్కడి నుంచి బ్యూనస్ ఏర్స్, అటు నుంచి ఉషయా వెళ్లారు. అక్కడి నుంచి చివరగా అంటార్కిటికాకు చేరుకున్నారు. ఈ ప్రయాణంలో ఆమె అనేక విధాల దారులను చూపించారు. మంచుదారులు, మురికి నీటి తోవలు ఆమె ప్రయాణంలో చూపించారు. చివరకు ఆమె తన కస్టమర్‌కు ఫుడ్ డెలివరీ చేశారు.
తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ఇలా రాసుకొచ్చారు. ‘ఈ రోజు తాను సింగపూర్ నుంచి అంటార్కిటికాకు ప్రత్యేకంగా ఫుడ్ డెలివరీ చేశాను. ఇది సాధ్యం కావడానికి ఫుడ్ పాండాకు చెందిన అద్భుతమైన సిబ్బందితో భాగస్వామ్యం పంచుకున్నాను’ అని వివరించారు. 30వేలకు పైగా కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలు, నాలుగు ఖండాలకు ప్రతి రోజు సింగపూర్ ఫ్లేవర్ డెలివరీ చేయడం సాధ్యం కాదు అంటూ పేర్కొన్నారు.
Also Read: నువ్వు దేవుడురా సామి.... సైకిల్ మీద 9మంది పిల్లలను ఎక్కించుకొని....!
తన అంటార్కిటికా టూర్ కోసం 2021లో ఫండ్స్ రైజ్ చేయడానికి ప్రయత్నించానని ఆమె మరో పోస్టులో వివరించారు. ఇందుకోసం తనకు ఒక బ్రాండ్ స్పాన్సర్ సహకారం అవసరం పడిందని తెలిపారు. ఒక నెల క్రితమే తనకు ఫుడ్ పాండా నుంచి రిప్లై వచ్చిందని, తన కలను సుసాధ్యం చేయడానికి ఈ బ్రాండ్ అంగీకరించిందని వివరించారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. చాలా మంది కామెంట్లు చేశారు. ఒక వ్యక్తి అద్భుతం అని కామెంట్ చేయగా.. మరొకరు ఇది వెర్రితనమా అంటూ స్పందించారు.
