చైనాలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. తనకు కాబోయే కోడలు తన రక్తం పంచుకుని పుట్టిన కూతురేనని తెలిసి ఆ కాబోయే అత్తగారు.. కన్నతల్లి షాక్ కు గురయ్యింది.  గంటలో కొడుకుపెళ్లి.. అంతా కోలాహలం.. ఇంతలో  ఈ షాకింగ్ నిజం.. అయినా పెళ్లి సవ్యంగా జరిగిపోయింది... ఆశ్చర్యపోతున్నారా.. అయితే ఈ స్టోరీ చదివేయండి.. 

గంటలో పెళ్లి ఉందనగా పెళ్లి కుమారుడి తల్లి కాబోయే కూడలిని పరీక్షగా చూసింది. ఆమె చేతి మీద కనిపించిన పుట్టుమచ్చ చూసి షాక్ అయింది. ఎందుకు అంటే... తనకు కోడలు కాబోయే ఆ అమ్మాయి 20యేళ్ల  క్రితం తప్పిపోయిన తన కుమార్తెగా తల్లి గుర్తించింది. 

ఈ సంఘటన గత నెల 31న జియాంగ్సు ప్రావిన్స్‌లోని సుజౌ ప్రాంతంలో చోటుచేసుకుంది. పెళ్లికి మరి కొద్ది సమయం ఉందనగా కాబోయే అత్తగారికి వధువు చేతి మీద ఉన్న పుట్టుమచ్చ కనిపించింది. అది చూడగానే ఆమెకు గతం గుర్తుకు వచ్చింది. దాదాపు 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన కుమార్తె చేతి మీద కూడా ఇలాంటి మచ్చే ఉండేది. దాంతో అనుమానం వచ్చిన తల్లి.. వధువు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి కుమార్తె గురించి ప్రశ్నించింది.

అనుకోని ఆ ప్రశ్నకు వధువు తల్లిదండ్రులు ముందుగా షాక్ అయ్యారు. ఆ తరువాత కాసేపు ఆలోచించి నిజం ఒప్పుకున్నారు.  20 ఏళ్లుగా తమ కడుపులో దాచుకున్న రహస్యాన్ని వెల్లడించారు. తల్లిదండ్రులు చెప్పిన ఆ రహస్యం అక్కడున్న వారిని షాక్ చేసింది. 

ఇంతకీ ఆ సీక్రెట్ ఏంటంటే పిల్లలు లేని ఆ దంపతులకు 20 ఏళ్ల క్రితం ఓ చిన్నారి దొరికింది. దాంతో ఆ పాపను వారితోపాటు తీసుకువెళ్లి.. పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించారు. మంచి అబ్బాయిని చూసి పెళ్లి నిశ్చయించారు. తాము అనుకున్నట్లు జరిగితే ఒక గంటలో వారి పెంపుడు కుమార్తె వివాహం పూర్తయ్యేది.

కానీ వధువు చేతి మీద ఉన్న పుట్టుమచ్చ అంతా తలకిందులు చేసింది. 20 ఏళ్ల తర్వాత తన కన్నతల్లిని చూసిన ఆ అమ్మాయి కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యింది. ఆ దృశ్యం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. పెళ్లి ఆగిపోలేదు. ఈ పెళ్లికి తనకు అభ్యంతరం లేదని ఆ కన్నతల్లి, కాబోయే అత్తగారు చెప్పడంతో.. అనుకున్న ప్రకారమే వైభవంగా జరిగిపోయింది. అ

న్నా చెల్లెళ్లకు పెళ్లి ఏంటి అని ముక్కుమీద వేలేసుకోకండి. ఎందుకంటే ఆ కూతురు తప్పి పోయిన తర్వాత సదరు మహిళ ఈ అబ్బాయిని దత్తత తీసుకుంది. అతడే ఈ పెళ్లి కుమారుడు. ఈ సందర్భంగా సదరు మహిళ మాట్లాడుతూ నా కుమార్తె, పెంపుడు కుమారుడు వివాహం విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.

ఎందుకంటే వారిద్దరూ రక్తం పంచుకు పుట్టిన వారు కాదు కనుక వారి వివాహం నాకు ఆమోదమే. అని చెప్పడంతో.. యధావిధిగా వారి వివాహ తంతు పూర్తి అయ్యింది. ఇక పెళ్లి వేడుకకు వచ్చిన వారు ఈ సంఘటనకు ముందు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత నూతన దంపతులు నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆశీర్వదించారు.