ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరానికి వెలుపల ఉన్న 40 మైళ్ల రష్యా యుద్ధ ట్యాంకులు మరో రెండు మూడు రోజుల్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కోకతప్పవని నిపుణులు చెబుతున్నారు. త్వరలోనే ఇక్కడ టెంపరేచర్ -20 డిగ్రీల సెల్సియస్‌కు చేరుతుందని, తద్వారా ఆ కాన్వాయ్ ఇంజిన్లు స్టార్ట్ చేయకుంటే.. అవి ఫ్రీజర్లుగా మారుతాయని, తద్వారా అవి అందులోని సైనికుల ప్రాణాలనే తీయవచ్చని డిఫెన్స్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించిన తర్వాత అనేక ఆశ్చర్యకర విషయాలను చూశాం. అలాంటి వాటిలో ఒకటి ఈ నలభై మైళ్ల యుద్ధ ట్యాంకుల కాన్వాయ్. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం వెలుపల రష్యా సైనికులతో 40 మైళ్ల పొడువునా యుద్ధ ట్యాంకులు నిలిచి ఉన్న చిత్రాలు కలకలం రేపాయి. కీవ్ నగరాన్ని చుట్టుముట్టేస్తాయన్నట్టుగా ఉన్న ఆ యుద్ధ ట్యాంకుల కదలికలు కొన్నాళ్లుగా మందగించాయి. ఈ కాన్వాయ్‌పై డిఫెన్స్ ఎక్స్‌పర్ట్స్ కీలక వాదనలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవచ్చని, తద్వారా 40 మైళ్ల ఆ యుద్ధ ట్యాంకుల కాన్వాయ్‌లు ఫ్రీజర్‌లుగా మారుతాయని తెలిపారు. ఇంజిన్ నడపకుంటే.. ఆ వాహనాలు కచ్చితంగా రిఫ్రిజిరేటర్లుగా మారుతాయని, సైనికులు అందులోనే ప్రాణాలు కోల్పోయే ముప్పు ఉన్నదని పేర్కొన్నారు.

యుద్ధ ట్యాంకులు గడ్డకట్టిపోతుంటే.. ఆ సైన్యం చూస్తూ ఉండకపోవచ్చని, వాటి నుంచి బయట అడుగిడవచ్చని బాల్టిక్ సెక్యూరిటీ ఫౌండేషన‌్‌లో సీనియర్ డిఫెన్స్ ఎక్స్‌పర్ట్ గ్లెన్ గ్రాంట్ అన్నారు. యుద్ధ ట్యాంకుల నుంచివారు బయట అడుగు పెట్టి అడవుల్లోకి వెళ్లిపోవచ్చని తెలిపారు. తద్వారా వారు గడ్డకట్టుకుని మరణించకుండా నివారించుకోవచ్చని పేర్కొన్నారు.

ఆ భారీ కాన్వాయ్ కీవ్ నగరం వైపు కదులుతుండటం అప్పట్లో కలవరం రేపింది. అయితే, దీని కదలికలు ఇప్పుడు మందగించి మెల్లగా సాగుతున్నాయి. ప్రస్తుతం కీవ్ నగరం నడిబొడ్డుకు 19 మైళ్ల దూరంలో ఈ ట్యాంకులు ఉన్నాయి.

తూర్పు యూరప్ దేశాల్లో మరికొన్ని రోజుల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతాయని నిపుణులు చెప్పారు. మరో రెండు మూడు రోజుల్లో టెంపరేచర్ -20 డిగ్రీలకు పడిపోవచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే కీవ్, మరికొన్ని ప్రాంతాల్లో టెంపరేచర్ -10 డిగ్రీ సెల్సియస్‌లుగా ఉన్నదని వివరించారు.

కాగా, బ్రిటీష్ ఆర్మీ మాజీ మేజర్ కెవిన్ ప్రైస్ డైలీ మెయిల్‌తో మాట్లాడుతూ, రష్యా ట్యాంకులు 40 టన్నుల ఫ్రీజర్‌లుగా మారుతాయని అన్నారు. ఆ కఠిన శీతోష్ణస్థితులు యుద్ధం చేయడానికి వచ్చిన సైనికుల మనోస్థైర్యాన్ని సైతం దెబ్బతీయవచ్చని వివరించారు. ఎందుకంటే వారు ఆర్కిటిక్ స్టైల్ యుద్ధానికి సిద్ధమై వచ్చి ఉండరని చెప్పారు. 

అయితే, ఆ కాన్వాయ్ మెకానికల్ సమస్యల వల్ల, ఇంధన సరఫరాలో అవాంతరాల మూలంగా ఆగిపోయినట్టు కొన్ని వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఒక వేళ అదే నిజమైతే.. ఆ యుద్ధ ట్యాంకుల ఇంజిన్‌లు స్టార్ట్ చేయకుండా అలాగే ఉంచితే మాత్రం అవి ఫ్రీజర్‌లుగా మారి సైనికుల ప్రాణాలు తీస్తాయని చాలా వాదనలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా, ఉక్రెయిన్, రష్యా మధ్య సంధి కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ రాజీకి సిద్ధం అయినట్టు తెలుస్తున్నది. నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, అందుకే మిలిటరీ ఆపరేషన్ చేపడుతున్నట్టూ రష్యా చెప్పింది. ఇప్పుడు ఆ నాటో కూటమిలో చేరికపైనే ఉక్రెయిన్ కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు నిన్న ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ తాము నాటోలో చేరాలనే నిర్ణయాన్ని విరమించుకున్నట్టు తెలిపారు. తమను చేర్చుకోవాలని మోకరిల్లే దేశానికి నాయకత్వం వహించాలనుకోవడం లేదని పేర్కొన్నారు. నాటో కూటమి ఇలాంటి వివాదపూరిత విషయాలపై జంకుతున్నదని, రష్యాను తలపడటానికి తడబడుతున్నదని అన్నారు.