కలలు నిజమవుతాయా? కలలో వచ్చినవి నమ్మొచ్చా? వాటికి ఎంతవరకు క్రెడిబిలిటీ ఉంటుంది? ఇదో పెద్ద చర్చ. అయితే కలలు కొన్నిసార్లు నిజాలవుతాయి. వెంటనే కాకపోయినా సంవత్సరాలు గడిచాక అయినా నిజాలవుతాయి. అలాంటి ఓ కల రాత్రికి రాత్రి ఆ కుటుంబాన్ని కోటీశ్వరులను చేసింది. వివరాల్లోకి వెడితే.... 

కెనడాకు చెందిన ఓ వ్యక్తికి ఓ రోజు కలలో లాటరీ ద్వారా తమ కుటుంబం కోట్లు గెలుచుకున్నట్టు కల వచ్చింది. ఆ కలలో లాటరీ నెంబర్లు కూడా స్పష్టంగా కనిపించాయి. ఉదయాన్నే లేచీ ఆ విషయాన్ని తన భార్య డెంగ్ ప్రవతౌదమ్‌(57)కు చెప్పాడు. కొన్ని నెంబర్‌ల ద్వారా కోట్లు గెలిచినట్టు వివరించాడు. ఇదీ 20ఏళ్ల క్రితం నాడు జరిగిన విషయం. అయితే భార్య డెంగ్ ప్రవతౌదమ్ మాత్రం తన భర్త చెప్పిన మాటలను ఈ చెవితో విని.. ఆ చెవితో విడిచిపెట్టలేదు. 

తన భర్తకు కలలో వచ్చిన నెంబర్లు.. తమ కుటుంబానికి జాక్ పాట్ తెచ్చిపెడుతుందని,  కాసుల వర్షం కురిపిస్తుందని బలంగా నమ్మింది. అందుకే, కల వచ్చిన రోజునుంచి 20ఏళ్లుగా తన భర్త కలలో వచ్చిన నెంబర్ల ఆధారంగా ఒంటారియో లాటరీ అండ్ గేమింగ్ లో పాల్గొంటూ వచ్చింది. 

ఈ నేపథ్యంలో 2020 డిసెంబర్‌లో డెంగ్ ప్రవతౌదమ్ భర్తకు నిద్రలో వచ్చిన కల నిజమైంది. డెంగ్ ప్రవతౌదమ్ లాటరీలో 60 మిలియన్ల కెనెడియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.340కోట్లు) గెలుచుకున్నట్టు ఓఎల్‌జీ ప్రకటించింది. దీంతో ఆమె ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. 

ఈ విషయాన్ని మొదటగా తన భర్త చెప్పినప్పుడు తాను నమ్మలేదని చెప్పారు. అయితే అది వాస్తవం అని గ్రహించి.. ఒక్కసారిగా ఏడ్చేసినట్టు తెలిపారు. డబ్బు గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. 

కరోనా నేపథ్యంలో అప్పటి వరకు చేస్తున్న పని కూడా పోయిందన్నారు. తమ కుటుంబానికి స్థానిక చర్చి సహాయం చేస్తున్నట్టు చెప్పారు. 40ఏళ్లుగా తన భర్త లేబర్‌గా పని చేస్తున్నాడని పేర్కొన్నారు. ఈ డబ్బుతో పిల్లల ఫీజులను కట్టడంతోపాటు, ఓ ఇల్లును కొనుగోలు చేయనున్నట్టు ఆమె వెల్లడించారు. అంతేకాకుండా కొవిడ్ అనంతరం ప్రపంచ యాత్రకు వెళ్లనున్నట్టు తెలిపారు.