అమెరికా ఉద్యోగాలను పరిరక్షించేందుకు వలస వీసాలను నిషేధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే.. ఆ నిషేధం కేవలం 60 రోజులు మాత్రమే విధించనున్నట్లు ఆయన తాజాగా పేర్కొన్నారు. ఇమ్మిర్గేషన్ రద్దు ప్రకటనపై తీవ్రమైన నిరసనలు వ్యక్తం కావడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నారు.

ఈ నిషేధం ముఖ్యంగా గ్రీన్ కార్డ్ కోసం వచ్చేవారిని లక్ష్యంగా చేసుకొని అమల్లోకి తీసుకువస్తున్నట్లు అర్థమౌతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకున్న తర్వాత స్థానిక పౌరులకే ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యం ఉండాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.

‘‘ అమెరికాలోని నిరుద్యోగ పౌరులకు ప్రయోజనం ఉండాలనే ఉద్దేశంతోనే వలసలను నిలిపివేయాలని నిర్ణయించాం. ఆర్థిక వ్యవస్థ పుంజుకున్న తర్వాత ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యం ఇక్కడి వారికి ఉండాలన్నది మా లక్ష్యం. వైరస్ విజృంభణ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారి స్థానంలో వలస వచ్చిన వారిని చేర్చుకోవడం వల్ల ఇక్కడి వారికి అన్యాయం చేసినట్లే అవుతుంది. అమెరికా పౌరుల సంక్షేమమే మా తొలి ప్రాధాన్యం. ఈ నిషేధం 60 రోజుల పాటు అమల్లో ఉంది. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ని సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం’’ అని ట్రంప్ వివరించారు.

ఈ నిషేధం నుంచి ట్రంప్ కొందరికి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైరస్ పై పోరులో ముందున్న వైద్య సిబ్బంది ఆహార సరఫరా విభాగంలో పనిచేస్తున్న విదేశాయులను నిషేధం నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే హెచ్1 బీ వీసాపై కూడా ట్రంప్ మరో ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.