జెనీవా: కరోనా వైరస్ వ్యాప్తిని ఒక మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అభివర్ణించింది. ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోన్ అథనామ్ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఈ వ్యాధి బారినపడే వారి సంఖ్య పెరుగుతుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ వ్యాధిని అలక్ష్యం చేయవద్దని డబ్ల్యు హెచ్ ఓ అభిప్రాయపడింది. ఈ వైరస్ ను నిర్లక్ష్యం చేస్తే తీవ్రంగా నష్టం కల్గించే అవకాశం ఉందన్నారు.కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ వైఖరి మారదని ఆయన స్పష్టం చేశారు. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచంలోని పలు దేశాలకు వ్యాపించింది.

ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 4291 మంది ఈ వ్యాధితో మృత్యువాత పడ్డారు. సుమారు లక్ష మందికి పైగా ఈ వ్యాధి బారిన పడ్డారు. 

చైనా, ఇటలీ, ఇరాన్ దేశాల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. అమెరికాలో కూడ ఈ వ్యాధి ప్రభావం చూపుతోంది. ఇప్పటికే అమెరికాలో కరోనా కారణంగా 31 మంది చనిపోయారు. 1015 మందికి ఈ వ్యాధి సోకింది.