ఓ తొమ్మిదేళ్ల చిన్నారి.. కారు డ్రైవ్ చేసింది.. ఇంట్లోనే పేరెంట్స్ నిద్రపోతుంటే.. ఎవరికీ తెలీకుండా ఆ చిన్నారి.. తమ కారును డ్రైవ్ చేసింది. తన చెల్లెలిని కూడా తనతోపాటు ఆ కారులో తీసుకొని వెళ్లింది. అలా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... అమెరికాలోని లాస్ ఏంజెల్స్ కి చెందిన ఓ తొమ్మిదేళ్ల చిన్నారి కారు డ్రైవ్ చేసింది. ఇంట్లో తల్లిదండ్రులు నిద్రపోతుండగా.. తన నాలుగేళ్ల చెల్లితో కలిసి కారులో బయలు దేరింది. తమ ఇంటికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ బీచ్ వద్దకు వెళ్లి.. అక్కడ స్నానం చేసి.. తిరిగి ఇంటికి వచ్చేద్దామని ప్లాన్ వేసింది.

ఇంటి దగ్గర నుంచి బీచ్ కి వెళ్లింది. అక్కడ కారు పార్క్ చేసే క్రమంలో యాక్సిడెంట్ చేసింది. అనుకోకుండా.. ఓ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో.. పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. ఆ ఇద్దరు చిన్నారులను పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం.

 

చిన్నారులు కారు డ్రైవ్ చేస్తున్న వీడియోని పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వీడియో వైరల్ గా మారింది. అది రెడ్ కలర్ మాలిబు సీడెన్ కారుగా గుర్తించారు. ఆ వీడియోలో ఇద్దరు చిన్నారులు కూర్చొని కనపడుతున్నారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.

ఇద్దరు చిన్నారులు కారులో సీట్ బెల్ట్ పెట్టుకొని కూర్చున్నారని పోలీసులు చెప్పారు. ఇంటి దగ్గర నుంచి ఎలాంటి భయం లేకుండా దాదాపు 16 కిలోమీటర్లు చిన్నారులు కారులో రావడం పోలీసులను సైతం షాకింగ్ కి గురిచేసింది. ఆ చిన్నారులు అలా కారు డ్రైవ్ చేసుకుంటూ బయటకు వచ్చిన విషయం పోలీసులు చెప్పేవరకు వాళ్ల పేరెంట్స్ కి తెలియకపోవడం గమనార్హం. 

గతేడాది కూడా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ ఐదేళ్ల బాలుడు కారు డ్రైవ్ చేసుకుంటూ బయటకు వచ్చాడు. తనకు సంబంధించిన ఏదో కొనుక్కోవడానికి వచ్చానని అతను చెప్పడం గమనార్హం.