'బ్రెగ్జిట్' లొల్లి.. అసలు ఇదేంటి? దీని పరిణామాలేంటి?

What Is Brexit; All You Wanted To Know About It
Highlights

బ్రిటన్‌లో ప్రస్తుతం బ్రెగ్జిట్ సంక్షోభం నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంసమైన ఈ బ్రెగ్జిట్ గురించి, అసలు ఇదేంటో, దీని వలన కలిగే ప్రభావాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

బ్రిటన్‌లో ప్రస్తుతం బ్రెగ్జిట్ సంక్షోభం నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంసమైన ఈ బ్రెగ్జిట్ గురించి, అసలు ఇదేంటో, దీని వలన కలిగే ప్రభావాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

అసలు బ్రెగ్జిట్‌ అంటే ఏమిటి? 

యూరప్ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ తప్పుకోవడమే బ్రెగ్జిట్ (బ్రిటన్ ఎగ్జిట్). ఈ మేరకు ప్రతిపాధించిన డిమాండ్‌నే క్లుప్తంగా బ్రెగ్జిట్‌ అన్నారు. యూరప్ ఖండంలోని ఇతర దేశాలతో పోల్చుకుంటే, బ్రిటన్‌ను ప్రత్యేకమైన చరిత్ర, గుర్తింపు ఉంది. బ్రిటన్ ఇప్పుడు యూరప్ యూనియన్ నుంచి బయటకు వచ్చేసి, స్వతంత్ర దేశంలా వ్యవహరించాలని యోచిస్తోంది. ప్రస్తుతం బ్రిటన్ కూడా ఈయూ దేశాలలో ఒకటి కావడంతో, ఈ సమాఖ్యలోని పొరుగు దేశాల నుంచి బ్రిటన్‌కు వచ్చే వలసల సంఖ్య పెరిగి, ఆ దేశంలోని ప్రజలకు అవకాశాలు తగ్గిపోతున్నాయి.

బ్రిటన్‌ ప్రస్తుత జనాభాలో సుమారు 21.5 లక్షల మంది వలసలుగా వచ్చి చేరినవారే. ఈ నేపథ్యంలో, బ్రిటన్‌లో పుట్టి పెరిగిన వారి జీతాల పెరుగుదల వృద్ధి రేటు పడిపోవటం, స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోవటం, ఆర్థికవృద్ధి రేటు పడిపోతుండటం వంటి పలు కారణాల దృష్ట్యా బ్రిటన్ ఈయూ నుంచి బయటకు వచ్చేయాలని యోచిస్తోంది. ఇలా చేయటం వలన బ్రిటన్ తమ దేశంలోకి వచ్చే వలసలను తగ్గించి, తమ స్వదేశీయుల జీవనప్రమాణాలు పెంపొందించాలని చూస్తోంది. ఈయూ నుంచి బ్రిటన్ బయటకు రావాలనే వాదనకు అక్కడి పేద, మధ్యతరగతి ప్రజల నుంచి భారీ మద్దతు కూడా ఉంది.

ఈయూ నుంచి బ్రిటన్ బయటకు వస్తే ఏమవుతుంది?

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వచ్చినట్లయితే, పొరుగు యూరోపియన్ దేశాల నుంచి బ్రిటన్‌లోకి వచ్చే వలసల సంఖ్య తగ్గిపోయి, స్థానికంగా ఉన్న బ్రిటనీయుల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటుగా వారి జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంటుందనేది బ్రెగ్జిట్‌కు మద్దతిచ్చే వారి వాదన.

బ్రెగ్జిట్‌‌ను వ్యతిరేకించేవారు ఏం చెబుతున్నారు?

ఈయూ నుంచి బ్రిటన్ తప్పుకోవడాన్ని వ్యతిరేకించేవారు కూడా ఎక్కువ మందే ఉన్నారు. వీరి వాదన ప్రకారం, బ్రెగ్జిట్ అమలైతే యూరోపియన్ యూనియన్‌లో ఆర్థిక సంక్షోభం రావటం ఖాయమని, ఇదే గనుక జరిగితే అమెరికన్ డాలరు మారకంతో పోల్చుకుంటే బ్రిటిష్‌ కరెన్సీ పౌండ్‌ స్టెర్లింగ్‌ మారకం రేటు 20 శాతానికి మించి పడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిడిపి వృద్ధి రేటు కూడా పడిపోతుందని అంటున్నారు. కానీ బ్రెగ్జిట్‌ను సపోర్ట్ చేసే వారి వాదన మాత్రం మరోలా ఉంది. ఈయూ నుంచి బ్రిటన్ బయటకు వచ్చేసినంత మాత్రానా జిడిపి వృద్ధి రేటుకు ఎలాంటి ఢోకా ఉండబోదని, పైపెచ్చు ఇది ఇంకా 2030 నాటికి 1.6 శాతం మేర పెరిగే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు.

ఒకవేళ బ్రిటన్ ఈయూలోనే కొనసాగితే ఏం జరుగుతుంది?

ఒకవేళ బ్రిటన్ యూరోపియన్ యూనియన్ దేశాలలో ఒకటిగానే ఉండగలిగితే, బ్రిటన్‌కు వచ్చే నష్టమేమీ లేదనేది ఆర్థిక విశ్లేషకుల వాదన. ఇంకా ఇది లాభదాయకమైనదేనని చెబుతున్నారు. బ్రిటన్‌ విదేశీ వాణిజ్యంలో సగం ఈయూ దేశాలతోనే జరుగుతోంది. బ్రిటన్‌కు అందే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఎక్కువ భాగం ఈయు దేశాల నుంచే వస్తోంది. లండన్‌ అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా ఎదగడానికీ ఈయు సభ్యత్వం ఎంతో దోహదం చేసింది. బ్రిటన్ ఈయూలోనే ఉన్నట్లయితే, ఈ లాభాలన్నీ ఇలానే కొనసాగుతాయి. అలా కాదని బయటకు వస్తే, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద గండి పడే ఆస్కారం ఉందని చెబుతున్నారు.

ఈయూలో బ్రిటన్‌కు మొదటి నుంచే అసంతృప్తే?

బ్రిటన్ యూరోపియన్ యూనియన్‌లో భాగమే అయినప్పటికీ, ఇది ఇతర యూరప్ దేశాలతో టతస్థంగా వ్యవహరించేందనే ఆరోపణలు ఉన్నాయి. బ్రిటన్ గతంలో జరిగిన పారిశ్రామిక విప్లవ సమయంలోనే ఆసియా, ఆఫ్రికా దేశాల్లో వలసల స్థాపన కోసం మిగతా యూరప్‌ దేశాలతో పోటీ పడ్డది, ఆ కాలంలో కొన్ని యుద్ధాలను కూడా చేసింది. గడచిన 1957లో ప్రస్తుత యూరోపియన్ యూనియన్‌కు ప్రతి రూపమైన యూరోపియన్‌ ఎకనామిక్‌ కమ్యూనిటీ (ఈఈసి) ఏర్పడినపుడు కూడా అందులో సభ్యత్వం కోసం బ్రిటన్‌ ఆసక్తి చూపలేదు.

దాదాపు 16 ఏళ్ల తర్వాత 1973 లోనే బ్రిటన్ ఈఈసిలో సభ్యత్వం తీసుకుంది. ఇలా సభ్యత్వం తీసుకుందో లేదో కానీ రెండేళ్లకే ఇందులో కొనసాగాలా వద్దా అన్న ప్రతిపాదనను తెర మీదకు తీసుకువచ్చింది బ్రిటన్, కాకాపోతే అప్పుడు జరిగిన రెఫరెండంలో 67 శాతం మంది ఈ వాదనకు అనుకూలంగా స్పందించడంతో, చేసేది లేక ఇందులోనే కొనసాగాల్సి వచ్చింది. ఇటీవలి కాలంలో ఈయూలోని దేశాలపై అర్థిక, వలసల విషయాలతో పాటుగా పలు ఇతర అంశాలపై ఈయూ తన అధికారాన్ని ప్రయోగించడం ఎక్కువైంది.

మరోవైపు ఈయూలో తరచూ తలెత్తుతున్న ఆర్థిక సంక్షోభాలు కూడా బ్రిటన్‌ను బయటకు రావటానికి మరో కారణంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పలు యూరోపియన్ యూనియన్ దేశాల భారాన్ని ఇష్టమున్నా లేకపోయినా ఇతర దేశాలు తప్పనిసరిగా భరించాల్సిందే. ఇతర దేశాల ఆర్థిక భారాన్ని తాము మోయటమేంటనేది బ్రిటనీయుల వాదన. ఈ పరిస్థితులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన బ్రిటన్ అధిష్టానం, ఇకపై ఈయూతో తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించుకుంది. మరి ఈ పరిణామాల నేపథ్యంలో, బ్రిటన్‌లో ఎలాంటి ఆర్థిక, రాజకీయ పరిణామాలు తలెత్తుతాయో కాలమే నిర్ణయించాలి.

loader