Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి కొన‌సాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు నెమ్మ‌దిగా ముందుకు సాగుతున్న ర‌ష్యా బ‌ల‌గాలు.. పుతిన్ ఆదేశాల‌తో మ‌రింత దూకుడుగా ముందుకుసాగుతూ.. విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఉక్రెయిన్-ర‌ష్యా యుద్ధం.. బాంబుల మోత‌.. వేల మంది మృతి.. ర‌ష్యాపై ఆంక్ష‌లు.. ఉక్రెయిన్ కు విరాళాలు.. ఇత‌ర దేశాల పౌరుల త‌ర‌లింపు.. ఈ దాడి ప్రారంభ‌మైన ఈ ఎనిమిది రోజుల్లో చోటుచేసుకున్న సంఘ‌ట‌న‌లు గ‌మ‌నిస్తే..  

Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి కొన‌సాగుతూనే ఉంది. ర‌ష్యా మ‌రింత దూకుడుగా ప్ర‌ద‌ర్శిస్తుండ‌టంతో అంత‌ర్జాతీయ స‌మాజం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే శాంతియుతంగా ఈ వివాదాన్ని ప‌రిష్క‌రించుకోవాలని చాలా దేశాలు కోరుతున్నాయి. అయినప్ప‌టికీ ర‌ష్యా ఏమాత్రం ప‌ట్టించుకోకుండా దూకుడుగా ముందుకు సాగుతూ.. ఉక్రెయిన్ పై బాంబుల వ‌ర్షం కురిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు మార్లు ఆ దేశ నేత‌లు అణుబాంబు దాడులు గురించి ప్ర‌స్తావించ‌డం ఉక్రెయిన్ తో పాటు యావ‌త్ ప్ర‌పంచాన్ని ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు 9వ రోజుకి చేరుకోవడంతో పాటు, నకిలీ వార్తలు, ప్రచారం పెరుగుతున్న నేపథ్యంలో వాస్తవాలపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. రష్యా-ఉక్రెయిన్ ల మధ్య ఈ 8 రోజుల్లో చోటుచేసుకున్న సంఘ‌ట‌న‌లు ఇలా ఉన్నాయి... 

1. ఉక్రెయిన్ లోని డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల‌ను ర‌ష్యా స్వతంత్రంగా గుర్తించిన మూడు రోజుల త‌ర్వాత ఫిబ్ర‌వ‌రి 24న ర‌ష్యా ఉక్రెయిన్ పై మిలిట‌రీ చ‌ర్య‌ను ప్రారంభించింది. తాము పౌరుల‌ను ల‌క్ష్యంగా చేసుకోవ‌డం లేద‌ని మొద‌ట్లో పేర్కొన్న ర‌ష్యా.. ఆ త‌ర్వాత దూకుడు పెంచుతూ.. ఉక్రెయిన్ లోని న‌గ‌రాల‌పై బాంబుల వ‌ర్షం కురిపిస్తోంది. 

2. రెండు దేశాల మ‌ధ్య చాలా కాలం నుంచి వైరం కొన‌సాగుతోంది. ఈ సమస్య 1991లో సోవియట్ యూనియన్‌లో అంతకుముందు భాగమైన ఉక్రెయిన్ స్వాతంత్య్రం పొంది.. ప్రజాస్వామ్య.. సార్వభౌమ దేశంగా ప్రకటించుకున్న నాటి నుంచి వైరం పెరుగుతూ వ‌స్తున్న‌ది. 

3. 2021లో ప్రస్తుత ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ తన దేశానికి NATO సభ్యత్వం కోసం అమెరికాకు విజ్ఞప్తి చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ క్ర‌మంలోనే ర‌ష్యా దాడుల‌ను ప్రారంభించింది.

4. ర‌ష్యా దాడి కార‌ణంగా ఉక్రెయిన్‌లో పది లక్షల మందికి పైగా ప్రజలు దేశం విడిచి వ‌ల‌స వెళ్లారు. వీరి సంఖ్య మ‌రింత‌గా పెరిగే అవ‌కాశ‌ముంద‌ని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 

5. పాశ్చాత్య దేశాలు రష్యాకు వ్యతిరేకంగా అనేక కఠినమైన ఆర్థిక మరియు వాణిజ్య ఆంక్షలు విధిస్తూ.. ర‌ష్యా తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రిస్తున్నాయి. 

6. ఉక్రెయిన్ మారణహోమంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో రష్యాపై దావా వేసింది. రష్యా-ఉక్రెయిన్ ల‌ మధ్య ఇప్పటికే రెండు రౌండ్ల శాంతి చర్చలు జరిగాయి. అయితే, అవి స‌ఫ‌లం కాలేదు. 

7. ఐక్యరాజ్యసమితి ఇప్పటికే భద్రతా మండలిలో రష్యాకు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఐరాసా జ‌న‌ర‌ల్ అసెంబ్లీలో శాశ్వ‌త స‌భ్య దేశంగా ర‌ష్యాను తొల‌గించ‌డానికి అనేక దేశాలు ఓటువేశాయి. 

8. ఫిబ్రవరి 24న రష్యా దండయాత్ర ప్రారంభమైనప్పటి నుండి 2,000 మందికి పైగా ఉక్రేనియన్ పౌరులు మరణించారని ఉక్రేనియన్ అత్యవసర విభాగం పేర్కొంది. ఉక్రెయిన్‌లోని మొదటి ప్రధాన నగరమైన ఖెర్సన్‌ను రష్యా బలగాలు బుధవారం స్వాధీనం చేసుకున్నాయి. బెర్డియాన్స్క్, ఎనర్హోదర్ అనే రెండు చిన్న పట్టణాలను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా మంత్రిత్వ శాఖ ఇప్ప‌టికే ప్రకటించింది. అలాగే, మార్చి 3 వరకు 498 మంది రష్యా సైనికులు మరణించారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

9. ఐక్యరాజ్యసమితి ప్రకారం.. మార్చి 1 నాటికి, ఉక్రెయిన్‌లో 752 పౌర మరణాలు నమోదయ్యాయి. శుక్రవారం (మార్చి 4), రష్యా దళాలు ఐరోపాలో అతిపెద్దదైన జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్‌పై దాడి చేశాయి. రేడియేషన్ స్థాయిలలో ఇప్పటివరకు ఎటువంటి మార్పు లేదని ఉక్రెయిన్ నివేదించింది.

10. రష్యా ఇప్పటికే చెర్నోబిల్ పవర్ ప్లాంట్‌ను తన ఆధీనంలోకి తీసుకుంది.

11. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మరియు జనరల్ అసెంబ్లీలో రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి భారతదేశం ఇప్పటివరకు దూరంగా ఉంది. అయినప్పటికీ, యుద్ధ-సంఘర్షణ ప్రాంతం నుండి భారతీయులను సురక్షితంగా తరలించేలా చూడడానికి రష్యా మరియు ఉక్రెయిన్‌లతో ప్రధాని మోడీ సంభాషణలు జ‌రిపారు. మానవ హక్కులను ఉల్లంఘించకూడదని నొక్కి చెప్పారు.

12. సంక్షోభం మధ్య ఉక్రెయిన్‌కు భారతదేశం కూడా మానవతా సహాయం అందించింది.