కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. రోజు రోజుకీ ప్రపంచంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీనికి ఇప్పటి వరకు మందు కనిపెట్టకపోవడంతో..నివారణే మార్గమని నిపుణులు చెబుతున్నారు. అయితే.. కొందరు ఎంత చెప్పినా.. ప్రభుత్వాలు ఎంత మొత్తుకున్నా.. కనీసం మాస్క్ కూడా పెట్టుకోకుండా తిరిగేస్తున్నారు. దీంతో.. మాస్క్ పెట్టుకోవానికి ఇండోనేషియా ప్రభుత్వం వినూత్న శిక్ష విధిస్తోంది.

ఎవరైతే మాస్క్‌ ధరించరో వారు కరోనాతో చనిపోయిన వారిని పూడ్చడానికి గాను సమాధులు తవ్వాలని ఆదేశించింది. తూర్పు జావాలోని గ్రెసిక్ రీజెన్సీలో ఎనిమిది మంది బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్‌లు ధరించకుండా తిరిగారు. వారికి శిక్షగా కరోనాతో చనిపోయిన వారికి సమాధులు తవ్వాలని అధికారులు ఆదేశించారని తెలిపింది.

‘ప్రస్తుతం స్మశాన వాటికలో ముగ్గురు మాత్రమే సమాధులు తవ్వడానికి అందుబాటులో ఉన్నారు. కనుక మాస్క్‌ ధరించని వారికి శిక్షగా ఈ పని అప్పగిస్తే బాగుంటుందని భావించాను’ అని సెర్మ్ జిల్లా అధిపతి సుయోనో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులను ఒక సమాధి తవ్వడానికి నియమించారు. వీరిలో ఒకరు సమాధి తవ్వితే.. మరోకరు శవపేటికలో చెక్క బోర్డులను అమర్చుతారు అని తెలిపారు.

ఇలాంటి పనిష్మెంట్స్ ఉన్నాయి అని చెబితేనే ప్రజలు మాట వింటారని అక్కడి అధికారులు చెప్పడం విశేషం. ఇదిలా ఉండగా.. ఇండోనేషియాలో ఆదివారం వరుసగా ఆరవ రోజు 3,000 కి పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో రాజధానిలో సామాజిక దూర పరిమితులను తిరిగి విధించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఆదివారం కొత్తగా 3,636 కేసులు నమోదు కాగా.. 73 మంది మరణించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 2,18,382 కు, మరణాలు 8,723 కు చేరుకున్నాయి.