స్కూల్‌లో ఐదేళ్ల వికలాంగ(ఈఎస్ఈ) విద్యార్థి వస్తువులను ఇష్టారీతిన పడేశాడు. మరో నాలుగేళ్ల విద్యార్థితో పోట్లాడాడు. వారిని టీచర్ వారించినా వినలేదు. దీంతో ఇద్దరినీ కూల్ డౌన్ రూమ్‌కు తీసుకెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేసింది. కానీ, ఆ ఐదేళ్ల విద్యార్థి ఉక్రోశంతో టీచర్‌పై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. ఐదేళ్ల విద్యార్థి దాడితో ఆ టీచర్ స్పృహతప్పి నేలపై కూలబడిపోయారు. ఈ ఘటన అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. 

న్యూఢిల్లీ: స్కూల్‌(School)లో చెప్పిన మాట వినకుండా క్రమశిక్షణగా మెలగకుంటే.. విద్యార్థుల (Student)ను ఉపాధ్యాయులు (Teacher) దండిస్తుంటారు. ఇప్పుడు ఆ దండనలూ లేవు. విద్యార్థులకు వీలైనంత మేరకు సర్ది చెబుతున్నారు. అంతేకానీ, టీచర్లపైకే విద్యార్థులు చేయి లేపడం అరుదు. అదీ ఎలిమెంటరీ స్కూల్‌లో టీచర్లపై విద్యార్థులు చేయి చేసుకోవడం దాదాపు ఉండదనే చెప్పాలి. కానీ, అమెరికాలోని ఓ ఎలిమెంటరీ స్కూల్‌లో అసాధారణ ఘటన చోటుచేసుకుంది. టీచర్‌ను కొట్టడమే.. కాదు.. పిడిగుద్దులు, తన్నులతో దాదాపు చావు అంచులకు తీసుకెళ్లాడో ఐదేళ్ల బుడతడు. ఔను.. ఇది నిజంగా జరిగింది. అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో చోటుచేసుకుంది.

దక్షిణ ఫ్లోరిడాలోని పైన్స్ లేక్ ఎలిమెంటరీ స్కూల్‌లో గతవారం ఈ ఘటన జరిగింది. పైన్స్ లేక్ ఎలిమెంటరీ స్కూల్‌లోని ఎక్సెప్షనల్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ విద్యార్థలు ఇద్దరు వాదులాడుకున్నారు. నాలుగేళ్ల విద్యార్థి, ఐదేళ్ల విద్యార్థి వస్తువులను అన్నింటినీ చెల్లాచెదురుగా పడేశారు. దీంతో సంబంధిత ఉపాధ్యాయురాలు వారిని వారించారు. అయినా వినకపోవడంతో వారిద్దరినీ ఆ గది నుంచి బయటకు తీసుకెళ్లింది. మరో రూమ్ కోపాన్ని చల్లార్చే (కూల్ డౌన్) గదికి తీసుకెళ్లి వారిని బుజ్జగించే ప్రయత్నం చేసింది. కానీ, ఆ విద్యార్థులు టీచర్ మాటను ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఆమెపై ఐదేళ్ల విద్యార్థి పిడిగుద్దులు గుద్దాడు. ఆమె ముఖం దాదాపు పచ్చడి చేసేశాడు. కాళ్లతోనూ ఆమెను తన్నాడు.

ఆమె ఒక్కసారిగా నేలకూలిపోయారు. గోడకు ఆనుకుని ఉలుకు పలుకు లేకుండా కూలబడి ఉన్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. నేలపై కూలబడి కూర్చున్న ఆ టీచర్‌ దరి చేరారు. ఎంత పిలిచినా పలుకలేదు. మాటలకు, చేతలకు ఆమె స్పందించలేదు. ఆమె చేతిపై టచ్ చేసినా స్పందన లేదు. అసలు జరిగిన విషయాన్నీ చెప్పే స్థితిలో ఆమె లేరు. దీంతో వెంటనే ఆమె దగ్గరకు స్ట్రెచర్ తెచ్చారు. ఆ స్ట్రెచర్‌పై ఎక్కించుకుని హాలీవుడ్‌లోని మెమోరియల్ రీజినల్ ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటన ఉదయం 10 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. మెమోరియల్ హాస్పిటల్‌లో చేరిన ఆమె కోలుకున్నారు. హాస్పిటల్ నుంచి సేఫ్‌గానే డిశ్చార్జ్ అయ్యారు. పోలీసులు వివరాల ప్రకారం, ఆమె ముఖంపై దాడి జరిగి ఉంటుందని, ఈ దాడిలో మెదడుపై ప్రభావం పడిందని, మరికొన్ని చోట్లా ఆమెకు గాయాలు అయ్యాయి.

ఏ రకమైన వికలాంగులు అయినా.. వారికి అనుగుణమైన సూత్రాలు తయారు చేసి వాటిని అధిగమించడానికి ఈఎస్ఈ స్కూల్స్‌లో చేరుస్తుంటారు. ఇక్కడ వికలాంగ విద్యార్థులకు టీచర్లు సహాయం చేస్తూ వారి వైకల్యాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తారు.

ఇటీవలే తెలంగాణకు చెందిన ఓ రెండో తరగతి విద్యార్థి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసు స్టేషన్‌కువెళ్లి టీచర్‌పై ఫిర్యాదు చేశాడు. టీచర్‌ను అరెస్ట్ చేయాలని పోలీసులను కోరాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లాలోని బయ్యారం మండలంలో చోటుచేసుకుంది. వివరాలు.. బ‌య్యారం మండ‌ల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో అనిల్ నాయ‌క్ అనే విద్యార్థి రెండో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. అయితే తన టీచర్ కొద్ది రోజులుగా కొడుతున్నాడని ఆరోపిస్తూ అతడు పోలీస్ స్టేషన్‌ ఫిర్యాదు చేశాడు. టీచర్ తనను తెగ కొడుతున్నాడని.. అతడిని అరెస్ట్ చేయాలని పోలీసులను కోరాడు.