అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసింది. కౌంటింగ్ ప్రారంభమయింది. ట్రంప్, జో బైడెన్ ల మధ్య హోరాహోరీగా పోరు సాగుతుంది. నిమిషనిమిషానికి లెక్కలు తారుమారవుతూ... ఎవరు గెలుస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరొక రెండు మూడు గంటల్లో అమెరికా తదుపరి రాష్ట్రపతి ఎవరో మనకు తేలిపోనుంది. 

ఇకపోతే అమెరికా ప్రజలు ఎన్నిక ప్రారంభమవడంకంటే ముందు నుండే భయాందోళనలు వ్యక్తం చేసారు. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెలువడుతుండడంతో అంతా కూడా ఇండ్లకే పరిమితమవుతూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. 

ట్రంప్ గనుక ఓడిపోతే అమెరికాలో ఆందోళనలు చెలరేగుతాయన్న భయం వారిని కలచివేస్తుంది. దానికి తోడు ట్రంప్ సైతం తాను ఓటమిని అంగీకరించబోమని, తాను గనుక ఓటమి చెందితే.... ఖచ్చితంగా ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్టేనని, రిగ్గింగ్ జరిగితేనే తాను ఓడిపోతాను తప్ప, లేకుంటే తనదే గెలుపు అంటూ చెబుతూ ఉండడంతో, అక్కడి ప్రజలు తీవ్రంగా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 

ఇకపోతే ప్రస్తుతం వస్తున్న ఫలితాల్లో ట్రంప్ తన సమీప డెమొక్రాట్ ప్రత్యర్థి జో బైడెన్ కన్నా కీలక రాష్ట్రాల్లో ఆధిక్యంలో దూసుకుపోతున్నాడు. ఇదే ట్రెండ్ కొనసాగితే ట్రంప్ మరోమారు అధ్యక్ష పీఠం ఎక్కడం ఖాయం.