వాషింగ్టన్: ఆమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ కు చేరుకున్నారు. కరోనా వైరస్ వ్యాధితో వాల్టర్ రీడ్ సైనిక ఆస్పత్రిలో చేరిన ఆయన డిశ్చార్జీ అయ్యారు. అక్కడ ఆయన నాలుగు రోజుల పాటు చికిత్స పొందారు ఆస్పత్రి నుంచి నేరుగా ఆయన వైట్ హౌస్ కు చేరుకున్నారు. 

మరో వారం పాటు ఆయనకు అక్కడ వైద్యులు చికిత్స అందించనున్నారు. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అవుతున్నందుకు సంతోషంగా ఉందని ట్రంప్ అన్నారు కోవిడ్ గురించి భయపడవద్దని ఆయన అన్నారు. మన జీవితాలపై వైరస్ ఆధిపత్యం ప్రదర్శించకుండా చూసుకోవాలని ఆయన అన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు.

వైట్ హౌస్ చేరుకుంటూనే ఆయన మాస్క్ ను తొలగించారు. త్వరలో ప్రచారంలోకి దూకుతానని ఆయన చెప్పారు. వైరస్ కు భయపడవద్దంటూ ఆయన ట్వీట్ చేశారు.  

మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ట్రంప్ అనూహ్యంగా బయటకు వచ్చిన కారులో తన అభిమానులకు అభివాదం చేస్తూ కలియతిరిగిన విషయం తెలిసిందే. అదే వీడియోను ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాస్కు ధరించి కనిపించారు.