కరోనా బారిన పడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్ధితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. ఈ మేరకు ఆయన వ్యక్తిగత ఫీజిషియన్ షాన్ కాన్లే ప్రకటించారు.

వాల్టర్ రీడ్ మిలటరీ ఆసుపత్రిలో ట్రంప్‌కు చికిత్స కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనకు రెమిడిసివర్ రెండు డోసులు ఇచ్చినట్టు కాన్లే చెప్పారు. ఇప్పటి వరకు ట్రంప్‌కు ఎలాంటి సమస్యలు తలెత్తలేదని వైద్యులు తెలిపారు.

చికిత్సకు ముందు ఆక్సిజన్ లెవల్స్ ఒక్కసారిగా తగ్గినా, చికిత్స తర్వాత 96 నుంచి 98కి పెరిగాయని డాక్టర్లు చెప్పారు. చికిత్స తీసుకుంటూనే మరోవైపు ట్రంప్ విధి నిర్వహణలో బిజీగా ఉన్నారని షాన్ కార్లే చెప్పారు.

ఆయన ఆరోగ్య పరిస్ధితిని నిపుణుల బృందం పర్యవేక్షిస్తోందని, రేపు కూడా ట్రంప్‌కు రెమిడిసివర్ ఇవ్వబోతున్నారని వెల్లడించారు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ట్రంప్ ట్విట్టర్‌‌లో మాత్రం యాక్టివ్‌గానే ఉన్నారు.

తన చికిత్సతో పాటు అమెరికాలో కరోనాపై పోరాటానికి సంబంధించి వరుస ట్వీట్లు చేస్తున్నారు. కరోనాపై పోరులో డాక్టర్లు నర్సులు, వాల్టర్ రీడ్ ఆసుపత్రి దేశంలోని ఇతర ఆసుపత్రులు చేస్తున్న కృషి అద్భుతమని కొనియాడారు.

గత ఆరు నెలల్లో కరోనా చికిత్సపై అమెరికా అద్భుత ప్రగతి సాధించిందన్నారు  ట్రంప్. అందరి సహాయంతోనే తాను బాగానే ఉన్నానని, అంతా బాగానే ఉందని ట్రంప్ ట్వీట్ చేశారు.