అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కల్లోలం రేపుతున్న సంగతి తెలిసిందే. రోజుకు సగటున 1,500 మంది మరణిస్తూ విలయ తాండవం చేస్తోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్నేహితుడు స్టాన్లీ చెరా కోవిడ్ 19తో మరణించారు.

ఆయన వయసు 78 సంవత్సరాలు. న్యూయార్క్ నగరంలో రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీకి కూడా స్టాన్లీ భారీ విరాళాలు అందించారు.

Also Read:సెల్ ఫోన్ టవర్ల వల్ల కరోనా వ్యాప్తి, ఈ ఫేక్ న్యూస్ దెబ్బకు టవర్లు ధ్వంసం

క్రౌన్ అక్వీసీషన్స్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఈ సంస్థ నగరంలో అనేక భారీ భవంతులను నిర్మించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డోనాల్డ్ ట్రంప్ ప్రచారం కోసం స్టాన్లీ దాదాపు 4 లక్షల డాలర్లు విరాళంగా ఇచ్చారు.

ట్రంప్ అల్లుడు జేర్డ్ కుషనర్‌తో స్టాన్లీకి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. గతేడాది న్యూయార్క్‌లో జరిగిన వెటరన్స్ డే పరేడ్‌లో స్టాన్లీని తన ప్రాణ స్నేహితుడంటూ ట్రంప్ బహిరంగంగా పరిచయం చేశారు.

Also Read:న్యూయార్క్ లో కుప్పలు తెప్పలుగా శవాలు.. అక్కడే ఎందుకలా?

ఇదే సమయంలో ఇటీవలే జరిగిన మీడియా సమావేశంలో తన స్నేహితుడు కరోనా బారిన పడ్డారని ట్రంప్ ప్రకటించారు. కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికాలో గడచిన 24 గంటల్లో 1,514 మంది ప్రాణాలు కోల్పోయారు.

వీరితో కలిపి అగ్రరాజ్యంలో కోవిడ్ మరణాల సంఖ్య 22,020 మంది బలయ్యారు. వీటిలో ఒక్క న్యూయార్క్‌లోనే 9,385 మంది మరణించారు. వైరస్ సోకిన వారి సంఖ్యలో, మరణించిన వారిలోనూ అమెరికాదే అగ్రస్థానం.