కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) వేగంగా వ్యాప్తి చెందుతూ ఆందోళన కలిగిస్తుంది. ఈ క్రమంలో వైపు వ్యాక్సినేషన్‌ను పెంచడం, వైరస్ వ్యాప్తికి చర్యలు చేపట్టిన అమెరికా ప్రభుత్వం.. కోవిడ్ చికిత్స కోసం యాంటీ కోవిడ్ టాబ్లెట్ వినియోగానికి అనుమతించింది.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) వేగంగా వ్యాప్తి చెందుతూ ఆందోళన కలిగిస్తుంది. ఈ ప్రభావం అమెరికాపైన ఎక్కువగానే ఉంది. గత వారం రోజుల్లో అమెరికాలో నమోదైన కరోనా కేసుల్లో 73 శాతానికి పైగా ఒమిక్రాన్ వేరియంట్‌కే చెందినవని సీడీసీ పేర్కొంది. అంటే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓ వైపు వ్యాక్సినేషన్‌ను పెంచడం, వైరస్ వ్యాప్తికి చర్యలు చేపట్టిన అమెరికా ప్రభుత్వం.. కోవిడ్ చికిత్స కోసం యాంటీ కోవిడ్ టాబ్లెట్ వినియోగానికి అనుమతించింది. ప్రముఖ ఫార్మా దిగ్గజం ఫైజర్ అభివృద్ది చేసిన పాక్స్‌లోవిడ్‌కు (Paxlovid) అత్యవసర వినియోగానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (Food and Drug Administration ) ఆమోద ముద్ర వేసింది.
కోవిడ్ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి దీనిని వినియోగించనున్నారు. నోటి ద్వారా అందించే కోవిడ్ యాంటీ వైరల్ డ్రగ్‌కు అమెరికా ఆమోదం తెలుపడం ఇదే తొలిసారి. పాక్స్‌లోవిడ్ రెండు రకాల టాబ్లెట్‌లను కలిగి ఉంది. 12 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గల హై రిస్క్ పెషేంట్ల కోసం దీనిని వినియోగించనున్నారు. ఇక, పాక్స్‌లోవిడ్ 88శాతం వరకు ఆస్పత్రిలో చేరడం, మరణాల ప్రమాదాన్ని తగ్గించగలదని క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు చెబుతున్నాయి.
ఫైజర్ కోవిడ్ యాంటీ కోవిడ్ టాబ్లెట్ అత్యవసర వినియోగానికి అమెరికా ఆమోదం తెలుపడంపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ‘నేటి చర్య సైన్స్ యొక్క శక్తికి, అమెరికన్ ఆవిష్కరణ యొక్క ఫలితం’ అని జో బైడెన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫైజర్ త్వరగా ఉత్పత్తిని పెంచడంలో సహాయపడే చట్టాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
‘నేటి చర్య.. తొలిసారిగా COVID-19 చికిత్స కోసం నోటి ద్వారా తీసుకునే యాంటీ వైరల్ మందును పరిచయం చేసింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో ఇది ఒక ప్రధాన ముందడుగు’ అని ఎఫ్‌డీఏ సెంటర్ ఫర్ డ్రగ్ ఎవాల్యుయేషన్, పరిశోధన డైరెక్టర్ డాక్టర్ ప్యాట్రిజియా కవాజోని (Dr. Patrizia Cavazzoni) ఒక ప్రకటనలో తెలిపారు.
