ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం అనేక మానవ విషాదాలను మిగుల్చుతున్నది. రష్యా దాడిలో మరణించిన తల్లికి తొమ్మిదేళ్ల బాలిక రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. కంటతడి పెట్టిస్తున్నది. ‘అమ్మా.. నీవు స్వర్గానికి వెళ్లాలని కోరుకుంటున్నాను. నేను చనిపోయేదాకా మంచి అమ్మాయిగానే ఉంటాను. తద్వారా నేను కూడా స్వర్గానికి వస్తాను. అక్కడ ఇద్దరు కలుద్దాం’ అని రాసుకుంది. ఆమె కూడా రష్యా దాడిలో ప్రాణాలు కోల్పోయింది.
న్యూఢిల్లీ: ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధ బీభత్సం ఎన్నో మానవ విషాద గాధలను ముందుకు తెస్తున్నది. జీవితాలు శిథిలమైపోతున్నా.. ప్రేమ అనుబంధాలను నిలుపుకోవాలనే తపన అడుగడుగున కనిపిస్తున్నది ఈ ఘటనలు గుండెలను పిండేస్తున్నాయి. అలాంటి ఘటనే ఒకటి తాజాగా మరోటి వెలుగులోకి వచ్చింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో ఓ తల్లి మరణించింది. ఆ తర్వాత ఆమె కుమార్తె కూడా మరణించింది. అయితే, ఆమె మరణానికి ముందు తల్లికి రాసిన ఆమె చివరి లేఖ మనసులను మెలిపెడుతున్నది. ‘ప్రపంచంలో నీ అంత మంచి అమ్మ మరెవరూ లేరు. నీవు కచ్చితంగా స్వర్గానికే వెళతావు. కాబట్టి, చచ్చే వరకు మంచి అమ్మాయిగా ఉండి నేను కూడా స్వర్గానికే వస్తానమ్మా. అక్కడ మనిద్దరం మళ్లీ కలుసుకుందాం’ అని తన డైరీలో రాసుకుంది. ఇప్పుడు ఆ 9 ఏళ్ల చిన్నారి కూడా మరణించింది.
ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహాదారుడు ఆంటన్ గెరాష్చెంకో ఈ లేఖ ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ లేఖలో ఇలా ఉన్నది. ‘నాకు మంచి బాల్యాన్ని ప్రసాదించిన నీకు కృతజ్ఞతలు. ప్రపంచంలో నువ్వే బెస్ట్ అమ్మవు అమ్మా. నేను నిన్ను ఎప్పటికీ మరువలేను. ఆ నీలి ఆకాశంలో నీవు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. నీవు స్వర్గానికి వెళ్లాలని కోరుకుంటున్నాను. మనం స్వర్గంలో మళ్లీ కలుద్దాం అమ్మా. నేను నాకు సాధ్యమైన మేరకు మంచి అమ్మాయిగా ఉండటానికి ప్రయత్నిస్తాను. తద్వార నేను కూడా స్వర్గానికి వస్తాను’ అని తొమ్మిదేళ్ల బాలిక ఆ తల్లిని ఉద్దేశించి తన డైరీలో లేఖ రాసుకుంది. చివరన ‘కిస్ యూ, గలియా’ అని రాసుకుంది.
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంలో ఆ బాలిక మరణించింది. ఆ బాలిక తల్లి రష్యా సైన్యం జరిపిన ఓ దాడిలో వారి కారులోనే మరణించినట్టు న్యూయార్క్ పోస్టు కథనం వెల్లడించింది.
రష్యన్ బలగాలు ఉక్రెయిన్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రష్యన్ సైనికులు బారి నుంచి తప్పించుకునేందుకు ఉక్రెయిన్ రాజధాని కైవ్‌కు 50 మైళ్ల దూరంలో ఉన్న ఇవాన్‌కివ్‌లో యువతులు తమ జుట్టును చిన్నగా కత్తిరించుకున్నారు. ఈ విషయాన్ని డిప్యూటీ మేయర్ మేరీనా బెస్చాస్ట్నా తెలిపారు. ఇలా జుట్టు కత్తిరించుకోవడం వల్ల రష్యన్ సైనికులకు తక్కువ ఆకర్షణీయంగా కనిపిస్తారని, దీంతో వారు ఆ యువతుల జోలికి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని, అందుకే అలా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పారు. ఇలా జుట్టు కత్తిరించుకోవడానికి మరో కారణం కూడా ఉందని ఆమె తెలిపారు. రష్యన్ సైనికులు జట్టు పట్టుకొని లాగి, వారిని ఆక్రమించుకొనే అవకాశం తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.
