ఉక్రెయిన్ రాజధాని కీవ్ రష్యా చేతుల్లోకి వెళ్లిందా? అంటే ఎక్కువ సేపు పట్టకపోవచ్చు అనే సమాధానం వస్తోంది. కీవ్ కు చాలా దగ్గరికి వచ్చేసిన రష్యా సేలను బాంబులు, తూటాలతో విరుచుకుపడుతోంది. ముఖ్యమైన స్థావరాల్ని స్వాధీనం చేసుకుంది.
కీవ్ : Russia ముప్పేట దాడితో Ukraine వణుకుతోంది. రెండు రోజులుగా ప్రధాన నగరాలు, సైనిక స్థావరాలని వరుసపెట్టి హస్తగతం చేసుకుంటున్న పుతిన్ సేనలు… ఇప్పుడు ఏకంగా ఉక్రెయిన్ రాజధాని kyivను దాదాపు స్వాధీనం చేసుకునే స్థితికి వచ్చేసాయి. ఇక ఏ క్షణంలోనైనా కీవ్ రష్యా సైన్యం చేతుల్లోకి వెళ్ళిపోవచ్చు. రష్యన్ ట్యాంకర్లు, బలగాలు శుక్రవారం తెల్లవారుజాము సమయానికే శివారు ప్రాంతాలకు చేరుకున్నాయి. కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బాంబులు, తూటాల వర్షం కురిపించాయి. దాడులు అంతకంతకు భీకరంగా మారి, ప్రాణనష్టం ఎక్కువవుతున్న తరుణంలో.. రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్చల మాట వినిపించారు. ఉక్రెయిన్ తో ఉన్నత స్థాయి చర్చలకు సిద్ధమని ప్రకటించారు.
అయితే ఉక్రెయిన్లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి, అక్కడ తన పాలనను స్థాపించాలన్నదే పుతిన్ లక్ష్యమని అమెరికా ఆరోపించింది. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను భూమార్గాల్లో రోమేనియా, హంగేరి సరిహద్దులకు తరలించి, అక్కడినుంచి విమానాల్లో తీసుకొచ్చేందుకు భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్ పై దాడుల నేపథ్యంలో రష్యా పై మరిన్ని ఆంక్షలు విధించేందుకు యూరోపియన్ యూనియన్ తో పాటు జపాన్, ఆస్ట్రేలియా, తైవాన్ లు సిద్ధమవుతున్నాయి. దీంతోపాటు రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గి లావ్రోమ్ కు చెందిన ఆస్తులను స్తంభింప చేసేందుకు ఈయూ కసరత్తు చేస్తోంది.
కీవ్ కు ఐదు కిలోమీటర్ల దూరంలోనే…
కీవ్ నగరానికి ఉత్తరాన కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే రాష్ట్ర రాజధానిలోని ప్రభుత్వ క్వార్టర్, కీలక ప్రాంతాలనులక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతున్నాయి. సిటీ సెంటర్ లోని సబ్ స్టేషన్ నుంచి బయటకు రావద్దని, ఆ ప్రాంతంలో కాల్పులు జరుగుతున్నాయని స్థానిక పోలీసులు ప్రజలను హెచ్చరించారు. ఈ విషయం తెలిసి.. కీవ్ వాసులు గురువారం రాత్రి పొద్దుపోయేవరకు అండర్ గ్రౌండ్ కు వెళ్లి తలదాచుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా భూఉపరితలంపై చోటుచేసుకున్న అతిపెద్ద యుద్ధంగా దీన్ని నిపుణులు అభివర్ణిస్తున్నారు.
రష్యా గుప్పెట్లోకి వ్యూహాత్మక విమానాశ్రయం
కీవ్ కు ఏడు కిలోమీటర్ల దూరంలోని హోస్టోమెల్ లో ఉన్న అత్యంత వ్యూహాత్మక విమానాశ్రయం ఇప్పుడు రష్యా గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. భారీ రవాణా విమానాల రాకపోకలకు అనువైన రన్వే ఇక్కడ ఉండటంతో, శివారుల్లని బలగాలను రాజధానిని తరలించడం ఆ దేశానికి సులువు కానుంది. తమ వాయుసేనకు చెందిన 200 హెలికాప్టర్లను హోస్టో మెల్ లో దిగేందుకు చర్యలు చేపట్టినట్లు రష్యా రక్షణ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనషెంకోవ్ తెలిపారు. దాడుల్లో ఉక్రెయిన్ ప్రత్యేక దళానికి చెందిన సుమారు 200 మంది మృతి చెందినట్లు ఆయన పేర్కొన్నారు. తమ సైనికులు ఎవరూ చనిపోలేదు అన్నారు. ఉక్రెయిన్ రక్షణశాఖ మాత్రం ఇప్పటి వరకు తాము రష్యాకు చెందిన సుమారు వెయ్యి మంది సైనికులను మట్టుబెట్టిన్నట్లు ప్రకటించింది.
ఇవాన్ కివ్, చెర్నిహైవ్ ల నుంచి కివ్ లోకి ప్రవేశించేందుకు రష్యా సేనలు ప్రయత్నిస్తున్నాయని దీంతో రాజధానికి 60 కిలోమీటర్ల దూరంలో భీకర పోరు చోటుచేసుకుందని ఉక్రెయిన అంతర్గత మంత్రిత్వ శాఖ సలహాదారు ఆంటో గెరాష్ చెంకో వెల్లడించారు.చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్న రష్యా, ఉక్రెయిన్ లతో కలిసి దాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్ లో ఉత్తమ పాలనను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారని రాజధానికి రష్యా ఆధీనంలోకి వెళ్లవచ్చని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పేర్కొన్నారు.
మాకు సాయం చేయకుంటే రేపు బలయ్యేది మీరే : జెలెన్ స్కీ
రష్యాతో జరుగుతున్న పోరాటంలో తాము ఒంటరిగా మిగిలిపోయామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆ దేశంపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని తమకు సాయం అందించాలని ప్రపంచ నేతలను అభ్యర్థించారు. జెలెన్ స్కీ రాజధాని ని విడిచి వెళ్లిపోయాడు అంట వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన శుక్రవారం మాట్లాడారు. ‘ప్రపంచ దేశాల సాయం అందుతుందని భావించామని.. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఇప్పుడు మాకు సాయం చేయకుంటే యుద్ధం రేపు మీ తలుపు తడుతుంది. సైనిక లక్షల పై దాడి చేస్తున్నామని చెబుతున్నా.. ప్రజలపై విరుచుకు పడుతోంది. రష్యాకు మొదటి గురి నేనే.’ అన్నారు.
