Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రష్యాతో కలిసి ఉమ్మడిగా చేపట్టనున్న మార్స్‌ మిషన్‌ ఎక్సోమార్స్‌ను నిలిపివేస్తున్నట్లు  యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ జోసెఫ్ అష్‌బాచెర్ ప్ర‌క‌టించారు.  hyde

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ.. ఇప్ప‌టికే ప‌లు దేశాలు, వివిధ అంత‌ర్జాతీయ సంస్థ‌లు ఆంక్ష‌లు విధించిన విష‌యం తెలిసిందే. తాజాగా.. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (European Space Agency) ర‌ష్యాకు కోలుకోలేని .. షాకిచ్చే.. కీలక నిర్ణయం తీసుకున్నది. రష్యాతో కలిసి ఉమ్మడిగా చేపట్టనున్న మార్స్‌ మిషన్‌ ఎక్సోమార్స్‌ను నిలిపివేస్తున్నట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు గురువారం నాడు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ESA) డైరెక్టర్ జనరల్ జోసెఫ్ అష్‌బాచెర్ ఒక ట్వీట్‌ చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి నిర‌స‌న‌గా.. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA), రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్‌తో మార్స్‌కు ఉమ్మడి మిషన్ ఎక్సోమార్స్ ప్రయోగాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

గత రెండు రోజులుగా.. European Space Agency అంతరిక్ష కార్యక్రమాలపై ర‌ష్యా- ఉక్రెయిన్‌ల‌ యుద్ధ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంద‌నే దాని గురించి త‌మ‌ సభ్య దేశాలు చర్చించాయనీ, ఈ నేపథ్యంలో రష్యాతో కలిసి ఉమ్మ‌డిగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో చేపట్టాల్సిన ఎక్స్‌మార్స్‌ ప్రయోగాన్ని నిలిపివేయాలని నిర్ణయించామని ప్ర‌క‌టించారు. ఇది కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ.. ఈ ప‌రిస్థితుల్లో ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకోవ‌డం చాలా అవసరమ‌ని పేర్కొన్నారు. అలాగే ఈ ప్రయోగంపై ముందుకు వెళ్లే మార్గాలపై సమాలోచన చేస్తామని ఆయన వెల్లడించారు.

ఉక్రెయిన్‌పై ర‌ష్యా దురాక్రమణ కారణంగా.. ఎంతో మంది అమాయ‌కులు ప్రాణాలు కోల్పోయారు. ల‌క్షలాది మంది.. ప్రాణాలు అరిచేత ప‌ట్టుకుని దేశ స‌రిహ‌ద్దు దాటారు. చాలా మంది విదేశీల్లో శ‌ర‌ణార్థులుగా మారారు. ఇలాంటి విషాదకరమైన పరిణామాల గురించి తీవ్రంగా విచారిస్తున్నామ‌ని తెలిపారు.

ESAలో 22 సభ్య దేశాలు

ర‌ష్యా సేనాల దుర‌క్ర‌మ‌ణ‌ను, ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితిని చర్చించడానికి మార్చి 16, 17 తేదీల్లో పారిస్ వేదిక‌గా.. ESA స‌మావేశ‌మైంది. ఈ రెండు రోజుల సమావేశానికి సంబంధించిన మరిన్ని వివరాలను అంతరిక్ష సంస్థ పంచుకుంది. కింది నిర్ణయాలను 'ఏకగ్రీవంగా' ఆమోదించినట్లు పేర్కొంది.
1) ఉక్రెయిన్ శరణార్థులకు మానసిక ఆరోగ్య సహాయాన్ని WHO కోరింది. 
2) ఎక్సోమార్స్ రోవర్ మిషన్‌లో రోస్కోస్మోస్‌( ర‌ష్యా)తో క‌లిసి సహకారాన్ని కొనసాగించడం అసాధ్యమ‌నీ, సహకారాన్ని నిలిపివేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ESA డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించింది.
3) మార్స్ మిషన్‌ను అమలు చేయడానికి అందుబాటులో ఉన్న ఎంపికలను మెరుగ్గా నిర్వచించడానికి ESA DG 'ఫాస్ట్-ట్రాక్' పారిశ్రామిక అధ్యయనాన్ని నిర్వహించాలి.
4) రాబోయే రోజుల్లో.. సభ్య దేశాలు ముందుకు వెళ్లడానికి వారి వ్యక్తిగత నిర్దిష్ట ప్రతిపాదనలను సమర్పించడానికి అసాధారణమైన సెషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్ర‌క‌టించింది.

రష్యా ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై దాడిని ప్రారంభించింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ దాడిని 'ప్రత్యేక సైనిక చర్య'గా పదే పదే ప్ర‌క‌టిస్తున్నారు. ఇదిలా ఉంటే.. యుద్ధం మొదలైనప్పటి నుంచి దాదాపు 13, 500 మంది రష్యా సైనికులు ఉక్రెయిన్ సైనికులు చేతుల్లో ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ ప్ర‌క‌టించింది. ర‌ష్యాకు చెందిన 404 ట్యాంకులు, 1279 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ ఆర్మీ ప్ర‌క‌టించింది.