ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రకటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. తమ సైన్యాన్ని ఆ దేశంలోకి పంపారు. రష్యా సైన్యాన్ని అడ్డుకోవడానికి, వారి ఆపరేషన్ నీరుగార్చడానికి ఉక్రెయిన్ సైన్యం వీలైన దారులన్నింటిని ఫాలో అవుతున్నారు. ఇందులో భాగంగా వారు ఉక్రెయిన్‌లో రష్యా సేనలు ప్రవేశించే మార్గాల సైన్ బోర్డులు మార్చేస్తున్నారు. 

న్యూఢిల్లీ: రష్యా(Russia) సైన్యాన్ని ఆపడానికి ఉక్రెయిన్(Ukraine) సాధ్యమైన అన్ని దారులను ఎంచుకుంటున్నది. ఈ యుద్ధంలో ఆర్మీతో పాటు అధికారులు, సామాన్య ప్రజలూ పాలుపంచుకుంటున్నారు. వీలైన విధంగా రష్యన్ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టాలని కంకణం కట్టుకున్నారు. ఉక్రెయిన్‌లోకి ప్రవేశించిన రష్యా సేనలను కన్ఫ్యూజ్(Confuse) చేయడానికి అక్కడి స్థానిక అధికారులు రోడ్ల సూచికలను మార్చేశారు. అంతేకాదు, ఆ డిజిటల్ రోడ్ సైన్‌లపై వారిని తిడుతున్నట్టుగా బూతులు దర్శనం ఇస్తున్నాయి.

ఉక్రెయిన్‌పై సైనిక చర్యను ప్రకటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ నెల 24వ తేదీన తమ సేనలను ఉక్రెయిన్‌కు వెళ్లాలని ఆదేశించారు. అదే సందర్భంలో ఉక్రెయిన్ ఎంపీ వొలొడిమిర్ అరీవ్ వెల్‌కమ్ టు హెల్ అంటూ రష్యా సేనలకు సూచనలు చేశారు. ఇప్పుడు ఉక్రెయిన్‌లో నిజంగానే రష్యా సేనల మార్గాలను నరకంగా మారుస్తున్నారు.

రష్యా చర్యలను మరింత ఆలస్యం చేయడానికే కాదు.. రష్యా గ్రౌండ్ యూనిట్ ఆర్మీని అపహాస్యం చేస్తూ వారు మార్గాలను సూచించే సైన్‌(Road Sign)లను మారుస్తున్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వ సంస్థ ఉక్రవ్‌టుడర్ ఈ విషయంపై ట్విట్టర్‌లో స్పందించింది. రష్యా ఆర్మీ ఉక్రెయిన్‌లో ప్రవేశించిన తరుణంలో తాము చేయాల్సిన ప్రథమ కర్తవ్యం.. మార్గాలను సూచించే సైన్ బోర్డులను మార్చేయాలని పేర్కొంది. ఒక్కో సైన్ బోర్డులో ఒక్కో తిట్టు రాసిపెడుతూ రష్యా సైన్యాన్ని కన్ఫ్యూజ్ చేయడంలో మునిగిపోయారు. కాగా, రోడ్లపై పాతిన సైన్ బోర్డులను తొలిగిస్తున్నారు. రష్యా సేనలకు ఉక్రెయిన్ నగరాలు, వీధులపై పెద్దగా అవగాహన ఉండదు కాబట్టి.. వారు తమ టార్గెట్‌లో చేరడంలో చాలా ఆలస్యం అవుతున్నది.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై ఉక్రెయిన్ స్పందిస్తూ.. త‌మ మాతృభూమిని ర‌క్షించుకోవ‌డానికి త‌మ సైనిక‌బ‌ల‌గాలు రష్యాకు ధీటుగా స‌మాధాన‌మిస్తున్నాయ‌ని తెలిపారు. ఉక్రెయిన్ మిల‌ట‌రీ పెర్కొన్న వివ‌రాలు ఇలా ఉన్నాయి.. రష్యా దళాలు దేశంపై 'దాడి వేగాన్ని' తగ్గించాయి. దాదాపు ఐదు రోజుల పోరాటంలో భారీ ప్రాణనష్టాన్ని చవిచూశాయని పేర్కొంది. 

ఉక్రెయిన్ సాయుధ బ‌ల‌గాల జ‌న‌ర‌ల్ స్టాఫ్ సోష‌ల్ మీడియాలో .. ర‌ష్యా దాడుల తీవ్ర‌త త‌గ్గిపోయింద‌ని అన్నారు. ర‌ష్యా త‌మ సైనిక‌, పౌర స్ధావ‌రాల‌పై దాడులు కొన‌సాగిస్తున్నా వారి చ‌ర్య‌ల‌ను తాము స‌వ‌ర్థ‌వంగా ఎదుర్కొంటున్నామ‌నీ, ర‌ష్యా ఆక్ర‌మ‌ణ‌దారులు చేసిన ప్ర‌య‌త్నాల‌న్నీ విఫ‌ల‌మ‌య్యాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ర‌ష్యా వైపు తీవ్ర న‌ష్టం వాటిల్లింద‌నీ, శ‌త్రు బ‌ల‌గాలు నైతికస్ధైర్యాన్ని కోల్పోయాయ‌ని వెల్ల‌డించారు. ప్ర‌చారార్భాటానికి, వాస్త‌వ ప‌రిస్ధితికి తేడాలు ఉంటాయ‌ని ర‌ష్యా గుర్తెరిగింద‌ని ఉద్దేవా చేశారు. త‌మ‌పై దాడుల‌కు తెగ‌బ‌డ్డ ర‌ష్యా ఇప్పుడు ఉక్రెయిన్‌ను చూసి భ‌య‌ప‌డుతున్న‌ద‌ని పెర్కొన్నారు. 

అంత‌కు ముందు ప్ర‌క‌ట‌న‌లో రష్యా దాడిలో 14 మంది చిన్నారులు సహా దాదాపు 352 మంది ఉక్రెయిన్ పౌరులు మరణించారని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే, 116 మంది చిన్నారులు సహా మరో 1,684 మంది గాయపడ్డారని తెలిపింది. ఇదిలావుండ‌గా, ర‌ష్యా తన దళాలు ఉక్రెయిన్ సైనిక స్థావ‌రాల‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొంది.ఉక్రెయిన్ పౌర జనాభా ప్రమాదంలో నెట్టే చ‌ర్య‌లు చేయ‌డం లేద‌ని వెల్ల‌డించింది.