రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో పుతిన్ సేనకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఖర్కివ్‌ ప్రాంతంలోని చుహివ్‌ నగరానికి రష్యా నుంచి విముక్తి లభించిందని ఉక్రెయిన్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ జనరల్‌ స్టాఫ్‌ వెల్లడించింది.  

ఉక్రెయిన్‌ను (Ukraine russia war) ఆక్రమించుకోవడం అనుకున్నంత తేలికకాదనే విషయం రష్యాకు నెమ్మదిగా అర్థమవుతోంది. పుతిన్ (putin) అంచనాలు తప్పి.. సుదీర్ఘ పోరుకు రంగం సిద్ధం కావడంతో రష్యా ఇమేజ్ దెబ్బతినే పరిస్దితి తలెత్తింది. అటు స్వదేశంలోనూ పుతిన్ అప్రతిష్ట మూటకట్టుకుంటున్నారు. ఉక్రెయిన్ దళాలు ఎలాంటి ప్రతిఘటన ఇవ్వకుండానే లొంగిపోతాయని, తమకు ఘనస్వాగతం పలుకుతారని పుతిన్ భావించారు. తీరా యుద్ధం మొదలయ్యాక అసలు వాస్తవం తెలిసి వస్తోంది. 

ఈ పరిణామాల నేపథ్యంలో రష్యాకు గట్టి షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. రష్యా సైనికులు స్వాధీనం చేసుకున్న ఓ నగరాన్ని తిరిగి తమ అధీనంలోకి తీసుకున్నట్లు ఉక్రెయిన్‌ సాయుధ బలగాలు వెల్లడించాయి. ఖర్కివ్‌ ప్రాంతంలోని (kharkiv) చుహివ్‌ నగరానికి (chuhuiv) రష్యా నుంచి విముక్తి లభించిందని అధికారులు తెలిపారు. ఆక్రమణదారులు భారీ మొత్తంలో ఆయుధాలు, సైనికులను కోల్పోయారు అని ఉక్రెయిన్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ జనరల్‌ స్టాఫ్‌ (ukraine armed forces general staff) వెల్లడించింది.

ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ప్రారంభించిన తర్వాత పుతిన్ సేనలు తొలుత విరుచుకుపడింది చుహివ్‌ నగరంపైనే. ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌కు అత్యంత సమీపంలో ఉండే ఈ నగరంపై రష్యా సేనలు ఫిరంగులు, బాంబుల వర్షం కురిపించాయి. దీంతో అనేక నివాస భవనాలు ధ్వంసమవ్వగా.. భారీ సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 

మరోవైపు యుద్ధంలో రష్యా భారీగా సైన్యాన్ని కోల్పోతోందని ఉక్రెయిన్‌ పలుమార్లు ప్రకటించింది. తాజాగా ఆ దేశానికి చెందిన ఇద్దరు ఉన్నత స్థాయి మిలిటరీ కమాండర్లు యుద్ధంలో మరణించినట్లు ఉక్రెయిన్‌ ఆర్మీ వెల్లడించింది. రష్యా సాయుధ బలగాల్లోని 61వ సపరేట్‌ మెరైన్ బ్రిగేడ్‌ కమాండర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ దిమిత్రీ సఫ్రనోవ్‌, 11వ సపరేట్‌ ఎయిర్‌బోర్న్‌ అసల్ట్‌ బ్రిగేడ్‌ డిప్యూటీ కమాండర్‌ లెఫ్టినెంట్ కల్నల్ డెనిస్‌ గ్లిబోవ్‌ చనిపోయినట్లు తెలిపింది.