ఉక్రెయిన్- రష్యా యుద్ధం నేపథ్యంలో ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు మొదలయ్యాయి. అటు ఉక్రెయిన్‌ డిమిలిటరైజేషన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించి తీరతామన్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.

ఉక్రెయిన్‌-రష్యా మధ్య (russia ukraine crisis) భీకర పోరు కొనసాగుతోంది. ఇరుపక్షాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఉక్రెయిన్‌లోని కీలక భాగాలను స్వాధీనం చేసుకునేందుకు రష్యా దాడులు చేస్తుండగా.. ఉక్రెయిన్ సైతం అదే స్థాయిలో ప్రతిఘటిస్తోంది. రెండు దేశాలను యుద్ధం నుంచి వెనక్కి రప్పించేందుకు గాను ప్రపంచదేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండో విడత శాంతి చర్చలను (russia ukraine peace talks) ఇరుదేశాలు ప్రారంభించాయి. బెలారస్‌-పోలండ్‌ సరిహద్దు ప్రాంతం ఈ చర్చలకు వేదికగా మారింది. ఇదే సమయంలో ఉక్రెయిన్‌ ప్రభుత్వం ప్రస్తుత యుద్ధ పరిస్థితులను ముగించడంతోపాటు డాన్‌బాస్‌లో శాంతిని పునరుద్ధరిస్తుందని ఆశిస్తున్నట్లు రష్యా విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఉక్రెయిన్‌లోని ప్రజలందరూ శాంతియుత జీవనానికి తిరిగి రావడానికి వీలు కల్పిస్తుందని భావిస్తున్నట్లు వెల్లడించింది. 

అంతకుముందు ఉక్రెయిన్‌ ప్రతినిధి బృందంలోని సభ్యుడైన డేవిడ్ అరాఖమియా మాట్లాడుతూ.. చర్చల్లో భాగంగా ఉక్రెయిన్‌లో మానవతా సహాయ చర్యల కోసం ‘హ్యూమానిటేరియన్‌ కారిడార్‌’ల ఏర్పాటుపై ప్రయత్నిస్తామని తెలిపారు. మరోవైపు చర్చలు జరిగినప్పటికీ తమ దాడులను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఆపే ప్రసక్తే లేదని రష్యా విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌ నిస్సైనీకరణే తమ లక్ష్యమని తేల్చిచెప్పింది. 

అటు ఉక్రెయిన్‌ డిమిలిటరైజేషన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించి తీరతామన్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (vladimir putin) . ఇదే విషయాన్ని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మేక్రాన్‌కు (emmanuel macron) ఆయన స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌ చర్చలను ఆలస్యం చేసే కొద్దీ మరిన్ని డిమాండ్లు తెరమీదికి తీసుకొస్తామని పుతిన్ అన్నట్లు రష్యా అధ్యక్ష కార్యాలయం తెలిపింది. అంతకుముందు సైనిక చర్యను ఆపాలని కోరుతూ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌.. పుతిన్‌తో దాదాపు గంటకుపైగా ఫోన్‌లో మాట్లాడారు. అయినప్పటికీ పుతిన్‌ వెనక్కి తగ్గే సూచనలు కనిపించకపోవడంతో రానున్న రోజుల్లో ఉక్రెయిన్‌లో పరిస్థితులు మరింత భయానకంగా వుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇకపోతే... ఉక్రెయిన్‌‌పై రష్యా బాంబుల దాడులు కొనసాగిస్తుంది. పలు ప్రాంతాలపై క్షిపణి దాడులతో విరుచుకుపడుతూ విధ్వంసం సృష్టిస్తుంది. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని కొన్ని నగరాలను రష్యా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అయితే రష్యా బలగాలకు కొన్నిచోట్ల ఉక్రెయిన్ ధీటుగా సమాధానం ఇస్తుంది. ఈ యుద్దం వల్ల ఉక్రెయిన్‌తో పాటు రష్యా వైపు కూడా భారీగానే నష్టం జరిగిందని నివేదికలు చెబుతున్నాయి. 

ఈ క్రమంలోనే రష్యాకు ఉక్రెయిన్ సైనికులు భారీ షాక్ ఇచ్చారు. అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగిన రష్యా యుద్ద విమానాన్ని ఉక్రెయిన్ వాయుసేన కూల్చివేసింది. సుఖోయ్ su-29 యుద్ద విమానాన్ని మిగ్-29 యుద్ద విమానంతో కూల్చివేశాయి ఉక్రెయిన్ బలగాలు. R-73 మిసైల్‌ను ప్రయోగించి కుప్పకూల్చింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ రక్షణ శాఖ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.