ఉక్రెయిన్, రష్యా ప్రస్తుతం నెలకొన్ని యుద్ద వాతావరణ పరిస్థితులను శాంతియుతంగా పరిష్కరించాలని ఐక్య రాజ్య సమితి సమావేశంలో భారత్ డిమాండ్ చేసింది. ఉక్రెయిన్ లో 20 వేల మంది భారత జాతీయులు నివసిస్తున్నారని, వారి శ్రేయస్సు తమకు ముఖ్యమని భారత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి అన్నారు. 

ఉక్రెయిన్ (Ukraine), రష్యా (Russia) మ‌ధ్య నెల‌కొన్నఉద్రిక్తతల ప‌రిస్థితుల‌ను వెంట‌నే త‌గ్గించాల‌ని ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి (ts tirumurthi) పిలుపునిచ్చారు. ఐక్య‌రాజ్య‌స‌మితి స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. రెండు దేశాల మ‌ధ్య ఉన్న ప‌రిస్థితుల‌ను చిత్తశుద్ధితో, నిరంతర దౌత్య ప్రయత్నాల ద్వారా శాంతియుతంగా పరిష్కరించాలని ఒత్తిడి చేశారు.

‘‘ఈ ప్రాంతం వెలుపల దీర్ఘకాలిక శాంతి, స్థిరత్వం కోసం అన్ని దేశాల చట్టబద్ధమైన భద్రతా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించేందుకు ఒక ప‌రిష్కారాన్ని క‌నుగొనాల‌ని భార‌త్ సూచిస్తోంది.’’ అని తిరుమూర్తి తెలిపారు. 20,000 కంటే ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు, జాతీయులు ఉక్రెయిన్‌లోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్నారని అన్నారు. భారత జాతీయుల శ్రేయస్సు విషయం తమకు చాలా ముఖ్యమని చెప్పారు. 

UNSCలో ఈ అంశంపై అమెరికా (america) విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ (antoni blinken) మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ శాంతి భద్రతకు అత్యంత ముప్పు అని అన్నారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి దౌత్యం మాత్రమే మార్గమని అని తెలిపారు. మిన్స్క్ (Minsk) ఒప్పందాన్ని అమలు చేయడం ఇందులో అతి ముఖ్య‌మైన భాగం అని చెప్పారు. ‘‘ ఈ సంక్షోభం ఈ కౌన్సిల్‌లోని ప్రతి సభ్యుడిని, ప్రపంచంలోని అన్ని దేశాలను నేరుగా ప్రభావితం చేస్తుంది. శాంతి, భద్రతల పరిరక్షణ ఈ కౌన్సిల్ ప్రాథమిక బాధ్యత ’’ అని ఆయ‌న అన్నారు. 

ఉక్రేనియన్ సరిహద్దుకు సమీపంలో రష్యా పెంచుతున్న సైనిక నిర్మాణాలపై MASKO, NATO దేశాల మధ్య ఈ వారం ఉద్రిక్తతలు పెరిగాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తుందనే భయాల నేపథ్యంలో అమెరికా తన మిత్రదేశాలకు మద్దతుగా యూరప్‌కు అదనపు బలగాలను ఇప్పటికే పంపింది. ఉక్రెయిన్‌పై దాడికి యోచిస్తున్న‌ట్టు వ‌స్తున్న‌ట్టు క‌థ‌నాల‌ను రష్యా ఖండించింది. మంగళవారం సరిహద్దు నుంచి కొన్ని బలగాలను ఉపసంహరించుకుంది.