ఉక్రెయిన్, రష్యా సంక్షోభాన్ని తొలగించడానికి సయోధ్య మార్గాలను అనుసరించాలని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ (MSC)లో పాల్గొనేందుకు ఆయన శుక్రవారం జర్మనీ చేరుకున్నారు. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
ఉక్రెయిన్ (Ukraine), రష్యా (Russia) మధ్య నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించడానికి దౌత్యమే సమాధానమని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (jai shankar) అన్నారు. రెండు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చేందుకు సయోధ్య మార్గాలను అనుసరించాలని ఆయన సూచించారు. జర్మనీలోని మ్యూనిచ్ లో నిర్వహించిన సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. మ్యూనిచ్ లో ‘ఎర్త్ అండ్ వాటర్: ఇంటర్‌సెక్టింగ్ పాలిటిక్స్ ఆఫ్ యురేషియా అండ్ ది ఇండో-పసిఫిక్ ’ అనే పేరుతో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉక్రెయిన్, రష్యా మధ్య ఉన్న సంక్షోభాన్ని తగ్గించేందుకు సయోధ్య మార్గాలను అవలంభించాలని అన్నారు.
మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ (MSC)లో పాల్గొనేందుకు ఆయన శుక్రవారం జర్మనీ చేరుకున్నారు. ఉక్రెయిన్‌పై NATO దేశాలు, రష్యా మధ్య పెరుగుతున్నఉద్రిక్తతపై MSC విస్తృతంగా చర్చించాలని భావించింది. MSC సందర్భంగా జైశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులు, ఇతర సీనియర్ ప్రతినిధులతో వరుస చర్చలు జరిపారు. ముందుగా ఆయన జర్మన్ కౌంటర్ అన్నాలెనా బేర్‌బాక్‌తో సమావేశమయ్యారు ఇండో-పసిఫిక్, ఉక్రెయిన్ చుట్టుపక్కల పరిణామాలు, ఆఫ్ఘనిస్తాన్‌లోని పరిస్థితులతో సహా ద్వైపాక్షిక, ప్రపంచ సమస్యలపై విస్తృత చర్చలు నిర్వహించారు.
అనంతరం సీనియర్ ప్రతినిధులలో, ఇరాన్ కౌంటర్ హెచ్ అమిరాబ్డోల్లాహియాన్, ఆస్ట్రియా కౌంటర్ అలెగ్జాండర్ షాలెన్‌బర్గ్, స్లోవేనియన్ విదేశాంగ మంత్రి ఆన్ ఇ లోగర్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ మరియు మరిన్నింటితో చర్చలు కొనసాగించారు.
మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ (Kamala Harris) శనివారం ప్రసంగిస్తూ.. ఉక్రెయిన్‌పై దాడి చేస్తే రష్యా అపూర్వమైన ఆర్థిక జరిమానాలను ఎదుర్కొంటుందని హెచ్చరించారు. అలాంటి దాడి ఐరోపా మిత్రదేశాలను అమెరికాకు దగ్గర చేస్తుందని ఆమె అంచనా వేశారు. పొరుగున ఉన్న ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) నిర్ణయం తీసుకున్నారని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ (Joe Biden) తెలిపిన మరుసటి రోజు అమెరికా ఉపాధ్యక్షురాలు ఈ ప్రకటన చేశారు.
‘‘ నేను స్పష్టంగా చెప్పగలను. నేను ఖచ్చితంగా చెప్పగలను. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేస్తే, యునైటెడ్ స్టేట్స్, మా మిత్రదేశాలు, భాగస్వాములతో కలిసి, గణనీయమైన, అపూర్వమైన ఆర్థిక వ్యయాలను విధిస్తుంది’’ కమలా హారిస్ చెప్పారు. ఆంక్షల పరిధిని వివరిస్తూ.. రష్యా ఆర్థిక సంస్థలు, కీలక పరిశ్రమలతో పాటు ఈ అకారణ దండయాత్రకు సహకరించే వారిని కూడా అమెరికా లక్ష్యంగా చేసుకుంటుందని ఆమె అన్నారు. ప్రపంచం చరిత్రలో నిర్ణయాత్మక క్షణంలో ఉందని ఆమె ఉక్రెయిన్ అధ్యక్షుడితో చెప్పారు. దీనికి ఆయన స్పందిస్తూ తన దేశం శాంతిని కోరుకుంటోందని అన్నారు. ప్రచ్ఛన్నయుద్ధం ముగిసినప్పటి నుంచి ఇంతటి విపత్కర పరిస్థితుల్లో మ్యూనిచ్ సమావేశం జరగలేదని కమలా హారీస్ తెలిపారు.
