ఉక్రెయిన్ సమీపంలో రష్యా ట్రూపులు భారీగా మోహరించి ఉన్నాయన్న నేపథ్యంలో ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు వొలొడైమిర్ జెలెన్స్‌కీ పశ్చిమ దేశాల అధినేతలతో సమావేశం అయ్యారు. ఆయన మ్యూనిచ్ నగరానికి వెళ్లి అక్కడ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఆ కాన్ఫరెన్స్ వేదికగా ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఓ ప్రతిపాదన చేశారు. సమావేశం అవుదామని, ప్లేస్ మీరే చెప్పండి అని కోరారు. 

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ దేశం చుట్టూ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఉక్రెయిన్ కేంద్రంగా రష్యా, పశ్చిమ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకు వస్తున్నాయి. రష్యా ఏ క్షణంలోనైనా ఉక్రెయిన్‌పై దాడి చేయవచ్చని అమెరికా హెచ్చరిస్తున్నది. ఇప్పటికే 1.50 లక్షల మంది ట్రూపులను రష్యా.. ఉక్రెయిన్ సమీపంలో మోహరించిందని ఆరోపించింది. కాగా, ఉక్రెయిన్‌పై దాడి చేయాలని తాము భావించడం లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పలుమార్లు స్పష్టం చేశారు. అయినా.. రష్యా ఆర్మీ మోహరింపులతో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలొడైమిర్ జెలెన్స్‌కీ పశ్చిమ దేశాల అధినేతలతో సమావేశం అయ్యారు. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌కు ఆయన వెళ్లారు.

ఆ కాన్ఫరెన్స్‌లో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా హాజరయ్యారు. ఉక్రెయిన్ పరిస్థితులపై వారు చర్చించారు. ఈ కాన్ఫరెన్స్ వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్‌కీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఓ ప్రతిపాదన చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏం కావాలనుకుంటున్నారో? వారు ఏం కోరుకుంటున్నారో తమకు తెలియదని అన్నారు. కాబట్టి, ఆ విషయాలు తెలుసుకోవడానికి తాను ఆయనతో ఓ సమావేశాన్ని ప్రతిపాదిస్తున్నానని వెల్లడించారు. ఆ చర్చలకు ప్లేస్‌ను రష్యానే డిసైడ్ చేసినా అభ్యంతరం లేదని వివరించారు. ఈ ఉద్రిక్తతలు చల్లార్చడానికి ఉక్రెయిన్ కేవలం దౌత్య మార్గాన్ని మాత్రమే అవలంభిస్తుందని స్పష్టం చేశారు. శాంతియుత వాతావరణం కోసమే తాము కట్టుబడి ఉన్నామని వివరించారు. అయితే, ఈ ప్రతిపాదనపై రష్యా నుంచి ఇంకా ప్రతిస్పందన రాలేదు.

కాగా, ఈ సమావేశంలో యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ, ఉక్రెయిన్‌ భద్రతకు అందరూ పాటుపడాలని అన్నారు. ఒక వేళ ఉక్రెయిన్ ఊబిలో చిక్కుకుంటే.. దాని విపరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తాయని వివరించారు. దాని పరిణామాలు తూర్పు ఆసియా.. తైవాన్‌లోనూ కనిపిస్తాయని తెలిపారు. ప్రజల్లోనూ తప్పుడు అభిప్రాయాలకు తావిస్తాయని చెప్పారు.

కాగా, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మాట్లాడుతూ, అమెరికా.. ఉక్రెయిన్ సార్వభౌమత్వానికి కట్టుబడి ఉన్నదని వివరించారు. ఇది ఒక చారిత్రక నిర్ణయాత్మక క్షణం అని తెలిపారు. ఒక వేళ రష్యా ఎలాంటి అవాంఛనీయ నిర్ణయం తీసుకున్నా.. తాము మునుపెన్నడూ చూడని రీతిలో ఆర్థిక ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు.

ఉక్రెయిన్ సంక్షోభాల మూలాలను ఓ సారి పరిశీలిద్దాం. రష్యా సామ్రాజ్యంలో కొన్ని శతాబ్దాలుగా ఉక్రెయిన్ దేశం భాగంగా ఉన్నది. ఆ తర్వాత అది సోవియెట్ యూనిన్ దేశాల్లోనూ భాగంగా ఉన్నది. కానీ, 1991లో యూఎస్ఎస్ఆర్ కూలిపోయిన తర్వాత ఉక్రెయిన్ దేశం రష్యా లెగసీ నుంచి బయటకు వెళ్లింది. స్వాతంత్ర్యం పొంది పశ్చిమ దేశాలకు దగ్గరవ్వ సాగింది. రష్యా నుంచి పశ్చిమం వైపు ఎంతగా దగ్గరయ్యిందంటే.. యూరోపియన్ యూనియన్‌తో ఒప్పందాలను వ్యతిరేకించిన రష్యా అనుకూల రాష్ట్రపతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. 2014లో ఆ రాష్ట్రపతి వైదొలగాల్సి వచ్చింది. కాగా, ఉక్రెయిన్ తూర్పు భాగం క్రిమియన్ పెనిన్సులానూ రష్యా తనకు అనుకూలంగా మలుచుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ వేర్పాటువాదులను ఎగదోసి ఉక్రెయిన్ దేశానికి వ్యతిరేకంగా ఘర్షణలకు పాల్పడుతున్నట్టు వాదనలు వచ్చాయి. రష్యానే ఆయుధాలు, ట్రూపులను పంపిస్తున్నదని ఆరోపణలు రాగా.. తమకు సంబంధం లేదని, అది వారి స్వచ్ఛంద నిర్ణయాలేనని రష్యా తొలుత కొట్టిపారేసింది. కానీ, అక్కడ రెఫరెండం నిర్వహించాక వారు రష్యాలో చేరుతామని ప్రకటించడంతో ఆ ప్రాంతం ఇక రష్యాలో భాగమని పుతిన్ ప్రకటించారు.