ఉక్రెయిన్‌లో యుద్ధం చేయడానికి క్రాష్ కోర్సు శిక్షణ ఇస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తీవ్రతరం అవుతుండటంతో పౌరులకు తుపాకీ శిక్షణ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రష్యా ఆక్రమణ వేగం పెరగడంతో పౌరులకు క్రాష్ కోర్సులో యుద్ధ విద్యలను నేర్పుతున్నారు. పశ్చిమ ఉక్రెయిన్ నగరం ఎల్వివ్‌లో శిక్షణ ఇస్తున్నారు.
న్యూఢిల్లీ: ఉక్రెయిన్(Ukraine)పై రష్యా(Russia) దాడితో ఎన్నో విషయాలు కొత్తగా ఆవిష్కృతం అవుతున్నాయి. నేరుగా ప్రజలను యుద్ధోన్ముఖులను చేయడం, వారికి ట్రైనింగ్ (Training) ఇవ్వడం, ఇప్పటికే సామాన్య పౌరులు రష్యా యుద్ధ ట్యాంకులను అడ్డుకోవడం వంటి ఎన్నో ఘటనలు చూశాం. ఇప్పుడు ఇదే కోవలో మరో అంశం ముందుకు వచ్చింది.
క్రాష్ కోర్సు అనగానే స్వల్ప సమయంలో వేగంగా ఓ కోర్సును నేర్చుకోవడం అని, అది చదువులకు, వృత్తికి, ఉద్యోగానికి సంబంధించినవిగానే మనకు తెలుసు. కానీ, ఉక్రెయిన్‌లో ఈ క్రాష్ కోర్సు (Crash Course) కొత్త అవతారం ఎత్తింది. ఏకంగా పౌరులను యుద్ధానికి సిద్ధం చేయడానికి ప్రభుత్వం క్రాష్ కోర్సులు నెర్పుతున్నది. ఈ కోర్సులకు పౌరుల నుంచి విశేష స్పందన వస్తున్నది. వారాల కొద్దీ సాగే ఆ శిక్షణను ఒక్క ఆదివారంలో చెప్పేస్తున్నారు.
రష్యా దాడులు ప్రారంభం కావడానికి పూర్వం అండ్రియ్ సెంకివ్ శాంతికాముకుడు. ఓ బ్లాగర్. కానీ, ఇప్పుడు గన్ ఎలా పట్టుకోవాలి? శత్రువును ఎలా మట్టుబెట్టాలో నేర్చుకుంటున్నాడు. ఉక్రెయిన్ పశ్చిమ నగరం ఎల్విల్‌లో ఆయన మరో 30 మందితో కలిసి యుద్ధం చేయడానికి క్రాష్ కోర్సులో చేరి శిక్షణ తీసుకుంటున్నాడు. ఆయనతోపాటు సేల్స్ మెన్, ఐటీ నిపుణులు, చెఫ్, ఫుట్ బాల్ క్రీడాకారుడు వంటి ఎందరో భిన్న వృత్తి, ప్రవృత్తి గల వ్యక్తులు యుద్ధానికి సిద్ధం అవుతున్నారు. పూర్వం ఎప్పుడో అంతరించిపోవాల్సిన ఈ యుద్ధ క్రీడ ఇంకా కొనసాగుతుండటం ఆందోళనకరం అని సెంకివ్ అన్నారు.
సోవియట్ కాలంలో రాజకీయ సినిమాలు వేసిన మాజీ రష్యన్ కల్చరల్ సెంటర్‌లో ఈ శిక్షణ జరుగుతున్నది. ఇప్పుడు ఆ సెంటర్‌లో తూర్పు ఉక్రెయిన్ దొంబాస్‌లోని వేర్పటువాదులతో పోరాడి మరణించిన ఉక్రెయిన్ జవాన్ల ఫొటోలను వేలాడదీశారు. ఈ దొంబాస్‌లోనే పోరాడిన డెన్నిస్ కొహుట్ పౌరులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ గదిలోని అందరిలోకెల్లా ఒక పది మంది రష్యా సైనికులను గురి పెట్టి తుపాకులు ఎక్కు పెట్టినా ఈ శిక్షణ కోర్సు సార్థకం అయినట్టేనని ఆయన అన్నారు.
యుద్ధ సమయంలో తమ వారిని, తమ ఆర్మీని హానీ పరచకుండా శత్రువులను టార్గెట్ చేసే విద్యలను, మెళకువలును చెప్పారు. నేలపై బల్లపరుపుగా పడుకోవడం, గన్‌ను ఎక్కుపెట్టి బ్యాలెన్స్ కోల్పోకుండా ఫైర్ చేయడం వంటి కొన్ని నైపుణ్యాలను నేర్పుతున్నారు.
రష్యాపై ఆంక్షలు విధిస్తున్న దేశాలపై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విమర్శలు గుప్పించారు. ఉక్రెయిన్ పై జరుపుతున్న యుద్ధాన్ని పుతిన్ సమర్థించుకున్నారు. ముందుగా రష్యా శాంతియుతంగా వివాదాల పరిష్కారానికి ప్రయత్నించిందని తెలిపారు. అయితే ఉక్రెయిన్ దీనికి అడ్డంకులు సృష్టించిందని, శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. నాటో తో చేతులు కలుపుతూ ముందుకు సాగిందని అన్నారు. అందుకే తమ దేశానికి ముప్పుగా మారిన ఉక్రెయిన్‌ను సైనిక, అణ్వాయుధ రహితంగా చేస్తామన్నారు. ఈ లక్ష్యం నెరవేరే వరకు యుద్ధం కొనసాగుతుందని హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైనప్పటి నుంచి రష్యాపై ఆంక్షల అస్త్రాలను ప్రయోగిస్తూనే ఉన్నాయి నాటో దేశాలు. బ్యాంకింగ్ నుంచి ఇంధనం వరకు అన్ని రంగాలలో రష్యాను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతుందనీ, మరో సంక్షోభం తలెత్తే అవకాశముందని ఐఎంఎఫ్ హెచ్చరించింది.
