కరోనా మహమ్మారి బారిన పడి ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతోంది. ముఖ్యంగా కొన్ని దేశాలు దాన్ని కట్టడి చేయలేక సతమతమవుతోంది. లండన్ లో కొత్త స్ట్రెయిన్ బయటపడినప్పటి నుంచి యూకేలో పాజిటివ్ కేసులు, మరణాలు గణనీయంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. 

దీంతో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు బోరిస్ జాన్సన్ సర్కార్ ఇప్పటికే పలు కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. దీంట్లో భాగంగా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న 33 దేశాలను రెడ్ లిస్ట్ లో పెట్టిన బ్రిటన్ ఈ దేశాల నుంచి వచ్చే పౌరులను పది రోజుల పాటు క్వారంటైన్ తప్పనిసరి చేసింది. 

ఈ పదిరోజుల్లో రెండుసార్లు కరోనా టెస్ట్ చేయించుకోవడం కూడా తప్పనిసరి అని చెప్పింది. క్వారంటైన్ పీరియడ్‌లో రెండు, ఎనిమిదో రోజున కొవిడ్ టెస్టులు చేయించుకోవాలి. 

దీంతోపాటు తాము ఎంపిక చేసిన 16 హోటళ్లలో మాత్రమే ఈ పది రోజులు క్వారంటైన్ లో ఉండాలని స్పష్టం చేసింది. దీనికి గాను ఒక్కో వ్యక్తి 1,750 పౌండ్లు అంటే సుమారు రూ.1.76 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని తెలిసింది. 

ఫిబ్రవరి 15 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ సందర్భంగా ఆ దేశ హెల్త్ సెక్రటరీ మాట్ హాన్కాక్ ఈ 33 దేశాల నుంచి వచ్చే వారికి తాజాగా కీలక సూచన చేశారు. ప్రభుత్వం అమలు చేయనున్న కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. 

బయటి దేశాల నుంచి బ్రిటన్ కు వచ్చిన వారు కరోనా పరీక్షలు చేయించుకోని పక్షంలో వెయ్యి పౌండ్ల జరిమానా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అలాగే కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే 10 ఏళ్ల జైలు శిక్ష ఉంటుందని స్పష్టం చేశారు. కాబట్టి యూకే వచ్చేవారు ఫిబ్రవరి 15 నుంచి ఈ ఆంక్షలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని సూచిస్తున్నారు.