బ్రిటన్ కు చెందిన 90యేళ్ల బామ్మ ప్రపంచంలోనే కొవిడ్ టీకా వేయించుకున్న తొలి వ్యక్తిగా నిలిచారు. యూకేలో ఫైజర్ టీకా పంపిణీ మంగళవారం నుంచి ప్రారంభమైంది. అక్కడి కాలమానం ప్రకారం.. ఈ ఉదయం 6.30 గంటల ప్రాంతంలో సెంట్రల్ ఇంగ్లాండ్ లోని కోవెంట్రిలోని యూనివర్సిటీ హాస్పిటల్ లో 90 యేళ్ల మార్గరెట్ కీనన్ తొలి టీకా వేయించుకున్నారు. 

ఫైజర్ టీకాకు క్లినికల్ అనుమతి లభించిన తర్వాత అధికారికంగా తీసుకున్న తొలి వ్యక్తి ఈమే కావడం విశేషం. ఇంకో విషయమేంటంటే.. మరో వారంలో ఈ బామ్మ 91వ సంవత్సరంలోకి అడుగుపెడుతుందట. ఈ సందర్బంగా మార్గరెట్ మాట్లాడుతూ మొట్టమొదటి  టీకా వేయించుకోవడం చాలా ప్రత్యేకంగా, ఆనందంగా ఉంది. నా పుట్టినరోజుకు పొందిన గొప్ప బహుమతి ఇదే. ఈ ఏడాదిలో చాలా వరకు నేను ఒంటరిగానే గడిపాను. త్వరలోనే నా కుటుంబం, స్నేహితులతో కలిసి సమయాన్ని గడిపేందుకు ఎదురు చూస్తున్నాను.. అని సంతోషంగా చెప్పారు. 

శుభవార్త : భారత్ లో రెండు వారాల్లో కరోనా టీకాకు అనుమతి?

జర్మనీకి చెందిన బయోఎన్ టెక్ తో కలిసి ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి యూకే ప్రభుత్వం ఇటీవల అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం నుంచి బ్రిటన్ లో టీకా పంపిణీ మొదలుపెట్టారు. తొలి ప్రాధాన్యంగా కరోనా ప్రమాదం పొంచి ఉన్న ఆరోగ్య సిబ్బందికి, 80 యేళ్ల వయసు పై బడిన వృద్ధులతో పాటు కేర్ హోంలో ఉండే వర్కర్లకు ఇవ్వనున్నారు. 

యూకేతో పాటు ఫైజర్ అమెరికాలో కూడా అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకుంది. దీనిపై అక్కడి ప్రభుత్వం డిసెంబర్ 10న సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ యూఎస్ లో కూడా అనుమతి లభిస్తే.. డిసెంబర్ మూడోవారం నుంచి అగ్రరాజ్యంలో టీకా పంపిణీ చేయాలని ఫైజర్ భావిస్తోంది. అటు భారత్ లోనూ టీకా అనుమతి కోసం ఫైజర్ దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే.