లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మరోసారి కరోనా బారినపడ్డారు. ఇటీవల తనను కలిసిన పార్లమెంట్ సభ్యుల బృందంలోని ఓ ఎంపీకి కరోనా పాజిటివ్ గా తేలడంతో క్వారంటైన్ లోకి వెళ్లిన బోరిస్ సోమవారం టెస్ట్ చేయించుకున్నారు. ఇందులో ఆయనకు పాజిటివ్ గా తేలినట్లే బ్రిటన్ ప్రధాని కార్యాలయం వర్గాలు వెల్లడించాయి. 

గతంలో బోరిస్ కరోనా బారినపడ్డారు. దీంతో ఆరోగ్యం క్షీణించి మూడురోజులు ఐసీయూలో ఉండాల్సి వచ్చింది. చికిత్స అనంతరం కోలుకొని తిరిగి విధులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం పలువురు ఎంపీలతో బోరిస్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీ లీ అండర్సన్ కు తాజాగా కరోనా పాజిటివ్గా తేలడంతో ప్రధాని అప్రమత్తమయ్యారు. 

కోవిడ్ నిబంధనల ప్రకారం బోరిస్ పది రోజులపాటు క్వారంటైన్ లో వుంటారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతానికి ప్రధానికి ఎలాంటి కరోనా లక్షణాలు
లేవని... అయినప్పటికి నిర్దారణ పరీక్ష చేయించామన్నారు. పాజిటివ్ గా తేలడంతో ఆయన నవంబర్‌ 26 వరకూ తన ఇంటి నుంచే అధికారిక కార్యకలాపాలు చేపడతారని ప్రధాని కార్యాలయం తెలిపింది.