ఓ వైపు అమెరికా వీసా నిబంధనలను కఠినతరం చేస్తుంటే మరోవైపు బ్రిటన్ మాత్రం తమ వీసా నిబంధనలను సులభతరం చేస్తోంది. ప్రస్తుతం బ్రిటన్‌లో మానవ వనరుల కొరత సమస్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 

అందుకే ఇ్పపుడు ఆ దేశ ప్రభుత్వం తమ దేశంలోని వచ్చే ఉద్యోగుల వీసా విషయంలో కొన్ని సడలింపులు చేసి, ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఇందులో భాగంగానే, ఇమిగ్రేషన్ పాలసీలో సవరణలు చేయాలని ఓ బిల్లును బ్రిటన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

ఈ బిల్లుకు ఆమోదం లభించినట్లయితే, బ్రిటన్‌లో ఉద్యోగాల వేట కోసం వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి వైద్య రంగానికి చెందిన వారికి ఈ బిల్లు మరింత లబ్ధి చేకూర్చనుంది. బ్రిటన్ జాతీయ వైద్య సేవల విభాగంలో కొన్ని కీలకమైన స్థానాలను భర్తీ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

గతంలో యూరప్ నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి బ్రిటన్‌కు వచ్చే నర్సులకు జారీ చేస్తున్న టైర్-2 వీసాలో కూడా సవరణలు చేసిన విషయం తెలిసినదే. ఇప్పుడు ఈ రకం వీసాలపై ఉన్న గరిష్ట పరిమితిని బ్రిటన్ ప్రభుత్వం ఎత్తివేసింది.  అంతేకాకుండా, నైపుణ్యం కలిగిన ఫ్యాషన్‌ డిజైనర్లకు టాలెంట్‌ వీసాను జారీ చేయాల్సిందిగా ఈ బిల్లులో ప్రతిపాదించారు.

విద్యార్థులకు చుక్కెదురు..

వర్క్ వీసా విషయంలో సడలింపులు చేసిన బ్రిటన్ ప్రభుత్వం, స్టూడెంట్ వీసా విషయంలో మాత్రం కఠినంగానే వ్యవహరిస్తుందని చెప్పాలి. వివిధ దేశాల నుంచి బ్రిటన్ విశ్వవిద్యాలయాలలో చదువుకునేందుకు వచ్చే విద్యార్ధుల వీసా విషయంలో కొన్ని సడలింపులు చేయాలని పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారు.

ఈ దేశాల జాబితాలో మాత్రం భారతదేశపు పేరును ప్రస్థావించలేదు. ఈ జాబితాలో ఇప్పటికే అమెరికా, కెనడా, న్యూజిలాండ్ దేశాలు ఉండగా కొత్తగా చైనా, బహ్రెయిన్, సెర్బియాలను చేర్చారు. 

ఆయా దేశాల నుంచి వచ్చే విద్యార్థులకు అనేక సడలింపులు కల్పించారు. వీరికి విద్య, ఆర్థిక పరిస్థితి, ఇంగ్లిష్ భాషపై పట్టు లాంటి నిబంధనలు ఉండవు. ఫలితంగా వారికి బ్రిటిష్ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందడం సులభమవుతుంది.