ఇస్లామిక్ స్టేట్ గ్రూపుతో సంబంధం ఉన్న అలైడ్ డెమోక్రటిక్ ఫోర్స్‌కు చెందిన సాయుధ తిరుగుబాటుదారులు పశ్చిమ ఉగాండా పాఠశాలపై భీకర దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 40 మంది మరణించారు.

ఇస్లామిక్ స్టేట్ గ్రూపుతో సంబంధం ఉన్న అలైడ్ డెమోక్రటిక్ ఫోర్స్‌కు చెందిన సాయుధ తిరుగుబాటుదారులు పశ్చిమ ఉగాండా పాఠశాలపై భీకర దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 40 మంది మరణించారు. మరో 8 మందికి గాయాలు అయ్యాయి. మృతులు, గాయపడినవారిలో ఎక్కువగా విద్యార్థులే ఉన్నారు. అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ అనేది డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్‌సీ)లో ఉన్న ఉగాండా సమూహం. ఈ మూక శుక్రవారం మ్పోండ్వేలోని లుబిరిహా సెకండరీ స్కూల్‌పై దాడి చేసింది. ఈ పాఠశాల కాంగోతో ఉగాండా సరిహద్దులో ఉంది.

పాఠశాలలో 60 మందికి పైగా విద్యనభ్యసిస్తున్నారని సమాచారం. వీరిలో ఎక్కువ మంది అక్కడే నివసిస్తున్నారు. అయితే స్థానిక కాలమానం ప్రకారం 23:30 గంటలకు (20:30 GMT) ఎడీఎఫ్ తిరుగుబాటుదారులు స్కూల్‌పై దాడి జరిపారు. డార్మిటరీని తగలబెట్టారు. అలాగే ఒక దుకాణాన్ని కూడా లూటీ చేశారని జాతీయ పోలీసు ప్రతినిధి ఫ్రెడ్ ఎనంగా తెలిపారు. ఇక, కొంతమంది బాలురు కాల్చివేయబడ్డారని, నరికి చంపబడ్డారని ఉగాండా సైన్యానికి చెందిన మేజర్ జనరల్ డిక్ ఓలమ్ మీడియాకు తెలిపారు. అంతేకాకుండా పాఠశాల నుంచి మరికొందరిని అపహరించారని.. వారిలో ఎక్కువ మంది బాలికలే ఉన్నట్టుగా ఆయన తెలిపారు. కొన్ని మృతదేహాలు బాగా కాలిపోయాయని.. వాటిని గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు.

ఇక, ఏడీఎఫ్ 1990లలో తూర్పు ఉగాండాలో సృష్టించబడింది. ముస్లింలను ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని ఆరోపిస్తూ దీర్ఘకాలంగా పనిచేసిన ప్రెసిడెంట్ యోవేరి ముసెవెనీకి వ్యతిరేకంగా ఆయుధాలను చేపట్టింది. 1998 జూన్‌లో కాంగో సరిహద్దు సమీపంలోని కిచ్వాంబా టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌పై ఏడీఎఫ్ జరిపిన దాడిలో 80 మంది విద్యార్థులు వారి వసతి గృహాలలో కాలిపోయారు. 100 మందికి పైగా విద్యార్థులు కనిపించకుండా పోయారు. 2001లో ఉగాండా సైన్యం చేతిలో ఓడిపోయిన తర్వాత.. ఏడీఎఫ్ కాంగోలోని ఉత్తర కివు ప్రావిన్స్‌కు మకాం మార్చింది.

ఏడీఎఫ్ ప్రధాన వ్యవస్థాపకుడు జమీల్ మకులు 2015లో టాంజానియాలో అరెస్టయ్యాడు. ఉగాండా జైలులో నిర్బంధంలో ఉన్నాడు. ఏడీఎఫ్ తిరుగుబాటుదారులు గత రెండు దశాబ్దాలుగా కాంగోలో ఉండి పనిచేస్తున్నారు. 2021లో ఉగాండా రాజధాని కంపాలా, దేశంలోని ఇతర ప్రాంతాలలో ఆత్మాహుతి బాంబు దాడుల వెనక ఏడీఎఫ్ హస్తం ఉన్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ సంస్థకు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ తో కూడా సంబంధాలు ఉన్నాయి. ADFను తిరుగుబాటుదారులను అణిచివేసేందుకు ఉగాండా ప్రభుత్వం వైమానిక, ఫిరంగి దాడులు చేపడుతోంది.