కాబోయే భార్యను సరదాకి ‘ఇడియట్’ అన్నందుకు.. ఓ యువకుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. రూ.4లక్షల జరిమానా, 60రోజులపాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తోంది. ఈ సంఘటన అబుదాబిలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. అబుదాబికి చెందిన ఓ యువకుడికి ఇటీవల వివాహం నిశ్చయమైంది. కాగా.. ఇటీవల అతను తనకు కాబోయే భార్యకు సరదాగా.. వాట్సాప్ లో ఇడియట్ అని మెసేజ్ చేశాడు. అతను సరదాకి అలా మెసేజ్ చేసినప్పటికీ.. కాబోయే భార్య కి ఆ పిలుపు నచ్చలేదు. దీంతో.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

చివరకు అతను ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.4లక్షలు ఫైన్ కట్టాల్సి వచ్చింది. అక్కడితో అయిపోలేదు. 6నెలల జైలు శిక్ష కూడా విధించారు. మన దేశంలో ఇడియట్ అనే పదాన్ని చాలా సరదాగా తీసుకుంటారు. ఈ పేరుతో టాలీవుడ్, బాలీవుడ్ లో సినిమాలు కూడా తీసేసారు. 

కానీ.. అరబ్ దేశాల్లో ఇలాంటి పదాలను చాలా సీరియస్ గా తీసుకుంటారు. సోషల్‌ మీడియాలో ఇలాంటి పదాలను, నేర పూరిత పదాలను వాడటాన్ని సైబర్‌ నేరంగా పరిగణిస్తారు. ఈ ఏడాది జనవరిలో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. దుబాయ్‌లో ఉంటున్న బ్రిటిష్‌ సిటిజన్‌ ఒకరు కార్‌ డీలర్‌ని తిడుతూ మెసేజ్‌ చేశాడు. దాంతో అతన్ని జైలు పంపించారు.