అమెరికాలో వరుస కాల్పులు ఆగేలా కనిపించడం లేదు. మిస్సోరిలోని సెయింట్ లూయిస్ హై స్కూల్‌లో షూటర్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు.ఆరుగురు గాయపడ్డారు. అధికారులు నిందితుడిని కాల్చి చంపారు.
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చేలరేగింది. తాజాగా ఓ దుండగుడు కాల్పులకు తెగపడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు బలి కాగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మిస్సోరిలోని సెయింట్ లూయిస్ హై స్కూల్‌లో చోటు చేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:10 గంటలకు సెంట్రల్ విజువల్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ హైస్కూల్ లోకి ఓ దుండగుడు ప్రవేశించి..విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు.
సెయింట్ లూయిస్ పోలీస్ మిషనర్ మైక్ సాక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ షూటర్ తుపాకీ తో పాఠశాల భవనంలోకి ప్రవేశించాడు. అనుమానితుడు పాఠశాల భవనంలోకి ప్రవేశించిన వెంటనే అక్కడ విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. అధికారులు అతనిపై కాల్పులు జరిపారని, అందులో అతను తీవ్రంగా గాయపడ్డాడని సాక్ చెప్పారు. నిందితుడు సుమారు 20 ఏళ్ల యువకుడిగా తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌లో ఏ అధికారికి గాయాలు కాలేదన్నారు.
అధికారులు అద్భుతంగా పనిచేశారని కమిషనర్ మైక్ సాక్ అన్నారు. అధికారులు, స్వాట్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో భవనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు తెలిపారు. కాల్పుల్లో ఇద్దరు మహిళలు మరణించారని, ఇతర బాధితులకు తుపాకీ గాయాలు, ష్రాప్‌నెల్ గాయాలు ఉన్నాయని చెప్పారు. గన్‌మెన్‌తో సహా ఎనిమిది మందిని ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందగా, ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అనుమానాస్పద సాయుధుడు కూడా ఆసుపత్రిలో మరణించాడని ఆయన చెప్పారు.
బాధిత కుటుంబాలకు సమాచారం అందించే పనిలో అధికారులు ఉన్నారని సాక్ చెప్పారు. నిందితుడిని ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.వారి పరిస్థితి నిలకడ గా ఉందని తెలిపారు. షూటౌట్‌లో ప్రాణాలతో బయటపడిన వారు షాక్‌కు గురయ్యారు. షూటింగ్‌కు ముందు దాదాపు 380 మంది విద్యార్థులు హాజరయ్యారని, పాఠశాల తలుపులు మూసి ఉన్నాయని సాక్ చెప్పారు. అనుమానితుడు భవనంలోకి ఎలా ప్రవేశించాడో భద్రతా సిబ్బంది చెప్పారు, అయితే సాయుధుడు ఎలా లోపలికి వచ్చాడు అనే దానిపై మరిన్ని వివరాలను అందించడానికి నిరాకరించారు.
ఈ కాల్పుల సంఘటన అమెరికన్ పాఠశాలల్లో మరణానికి లేదా గాయానికి కారణమైన డజన్ల కొద్దీ సంఘటనలలో ఒకటి. మే నెల లో టెక్సాస్‌లోని ఉవాల్డేలో ముష్కరుడు 19 మంది పిల్లలు మరియు ఇద్దరు పెద్దలను చంపాడు . ఇదే ఈ సంవత్సరంలో ఇప్పటివరకు అత్యంత ఘోరమైన సంఘటన.
