దేశాధ్యక్షుడికి వచ్చిన ఓ లేఖను తెరిచిన సహాయకురాలు అస్వస్థతకు గురైన సంఘటన ఆ దేశంలో కలకలం రేపింది. విషపు లేఖను పంపి అధ్యక్షుడి హత్యకు కుట్ర చేసిన ఆ గుర్తు తెలియని వ్యక్తి కోసం ఆర్మీ గాలిస్తోంది.

ట్యూనిషియాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.  ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ దేశాధ్యక్షుడికి ఓ లేఖ పంపారు. ఆ లేఖ తెరిచిన అధ్యక్షుడి సహాయకురాలు అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను ఆర్మీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగానే ఉంది. 

దేశాధ్యక్షుడిని హత్య చేసే కుట్రలో భాగంగానే ఆ లేఖ పంపినట్టు గుర్తించారు. దీంతో ఆ దేశ అధికారులు అప్రమత్తమయ్యారు. దీనిమీద వెంటనే దర్యాప్తు మొదలు పెట్టారు. 

వివరాల్లోకి వెడితే.. ట్యూనిషియా అధ్యక్షుడు కైస్‌ సయీద్‌కు సోమవారం గుర్త తెలియని వ్యక్తి నుంచి ఓ లేఖ వచ్చింది. ఈ లేఖను ఆయన వ్యక్తిగత సహాయకురాలు నదియా అకాచ గురువారం అధ్యక్షుడి టేబుల్‌పై పెట్టారు. అనంతరం ఆ లేఖను తెరిచి చూసింది. 

అయితే ఆ ఉత్తరంలో ఖాళీ పేపర్‌ ఉండడంతో అనుమానం వచ్చింది. లేఖ తెరచి చూసిన వెంటనే అందులోనుంచి ఓ రకమైన వాసన వచ్చింది. ఆ తర్వాత నదియా అకాచ కళ్లు మండడం, తలనొప్పి రావడం మొదలైంది. 

ఆ వెంటనే నదియా నీరసపడ్డారు. అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన అక్కడి భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ లేఖను దూరంగ పెట్టారు. అస్వస్థతకు గురైన నదియా ను వారు ఆస్పత్రికి తరలించారు.

ఈ విషపు లెటర్ ఆ దేశంలో కలకలం రేపింది. దేశాద్యక్షుడి భద్రతపై అనుమానాలు తలెత్తాయి. దీంతో అధ్యక్షుడు కైస్‌ సయీద్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. విషపు లెటర్ తో నాకేం కాలేదు’’ అని తెలిపారు. తాను ఆరోగ్యంగనే ఉన్నానని ప్రకటించారు. అయితే దేశాధ్యక్షుడినే టార్గెట్ చేసిన ఈ ఘటనపై భద్రతా దళాలు ప్రత్యేక దర్యాప్తు మొదలుపెట్టారు.