పరాకాష్టకు చేరిన ట్రంప్ తిక్క: కరోనా వైరస్ కి మందులుగా లైజాల్, డెట్టాల్!
తాజాగా ట్రంప్ ఒక తిక్క కామెంట్ చేసాడు. లైజాల్, డెట్టాల్ లు క్రిమి సంహారకంగా అంతబాగా పనిచేస్తున్నప్పుడు వాటిని మనిషి శరీరంలోకి ఎక్కించి శరీరాన్ని క్లీన్ చేసే దిశగా తద్వారా ఈ మహమ్మారిని అంతమొందించేందుకు ప్రయోగాలను చేయొచ్చు కదా అని శాస్త్రవేత్తలకు ఉచిత సలహా ఇచ్చాడు.
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మనమంతా ఇప్పుడు లాక్ డౌన్ లో ఉండడానికి కారణం కూడా ఈ మహమ్మరే. అలాంటి ఈ కరోనా వైరస్ మహమ్మారి కి వాక్సిన్ ఇంకా రాలేదు. వాక్సిన్ రావడానికి కనీసం ఇంకొక సంవత్సర కాలమైనా పట్టేలా కనబడుతుంది.
ఇలా వాక్సిన్ కి సమయం పడుతుండడంతో ఈ వైరస్ ను నయం చేయడానికైనా ఒక మందును కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ కృషి చేస్తున్నాయి. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ నుండి మొదలు హెచ్ఐవి మందుల వరకు రకరకాల చికిత్సలనందిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు వైద్యులు.
ఇక ఈ కరోనా మహమ్మారిని మొదటి నుండి కూడా చాలా చిన్నదానిగా, దీనివల్ల అంత ప్రమాదం లేదని చెబుతూ వస్తున్న ట్రంప్ కి అమెరికాలో ఒక్కసారిగా ఈ వైరస్ విజృంభించడంతో ఏమి చేయాలో అర్థం కావడం లేదు. ఈ సంవత్సరం నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి.
ఈ ఎన్నికల సంవత్సరంలో ఈ వైరస్ విరుచుకుపడుతుంది. ఇప్పటికే అమెరికాలో మరణాలు 50 వేలను దాటాయి. ఇంకా కూడా ట్రంప్ తేరుకోకపోతే అమెరికాకు, ట్రంప్ కి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ భారతదేశాన్ని సైతం హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందుల కోసం బెదిరించాడు.
నిన్న తాజాగా గిలియడ్ సైన్సెస్ తయారు చేసిన ఒక మందు క్లినికల్ ట్రయల్స్ లో ఫెయిల్ అయింది. ఈ మందుపై చాలా ఆశలను పెట్టుకున్న ట్రంప్ కు నిరాశే మిగిలింది. ఇక దానితో తన సొంత పైత్యానికి పని పెట్టాడు.
తాజాగా ట్రంప్ ఒక తిక్క కామెంట్ చేసాడు. లైజాల్, డెట్టాల్ లు క్రిమి సంహారకంగా అంతబాగా పనిచేస్తున్నప్పుడు వాటిని మనిషి శరీరంలోకి ఎక్కించి శరీరాన్ని క్లీన్ చేసే దిశగా తద్వారా ఈ మహమ్మారిని అంతమొందించేందుకు ప్రయోగాలను చేయొచ్చు కదా అని శాస్త్రవేత్తలకు ఉచిత సలహా ఇచ్చాడు.
ట్రంప్ ఇచ్చిన ఈ సలహా దెబ్బకు షాక్ కి గురైన డెట్టాల్, లైజాల్ లను తాయారు చేసే కంపెనీ వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మానవుల శరీరంలోకి ఎక్కించరాదని, వీటిని మనుషుల మందులుగా తాయారు చేయలేదని ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది.
ఇప్పటికే ట్రంప్ ఒకసారి క్లోరోక్విన్ పై ఇలానే చేసిన కామెంట్స్ వల్ల అమెరికాలో ఆక్వేరియం లను క్లీన్ చేసే క్లోరోక్విన్ ను సేవించి ఒకరు మరణించారు కూడా. మళ్ళీ ట్రంప్ వ్యాఖ్యల వల్ల ఇంకెవరైనా ఆవేశపడి డెట్టాల్ ని తాగుతారేమో అన్న భయానికి ఆ సదరు కంపెనీ ఈ విధంగా ప్రకటన విడుదల చేయవలిసి వచ్చింది.