కరోనా మహమ్మారి మన దేశంతోపాటు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఎట్టకేలకు మన దేశంలో దీనికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికీ పలువురు ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు కూడా. మన దేశ ప్రజలతోపాటు.. ఇతర దేశాలకు సైతం భారత్ వ్యాక్సిన్  పంపిణీ చేస్తోంది.

భారత ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు వ్యాక్సిన్ డోస్‌లను ఉచితంగా పంపిస్తున్న విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం చర్యల పట్ల తాజాగా అమెరికా ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. ప్రపంచ దేశాలకు సహాయం చేసేందుకు భారత్ తమ ఫార్మా రంగాన్ని ఉపయోగించుకోవడంపై యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అభినందించింది. 

లక్షల కొద్దీ వ్యాక్సిన్ డోస్‌లను విదేశాలకు బహుమతిగా ఇవ్వడాన్ని ప్రశంసించింది. కాగా.. భారత ప్రభుత్వం బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మాల్దీవులు, మయన్మార్, మారిషస్, సేషెల్స్ దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్ డోస్‌లను అందజేసింది. బ్రెజిల్, మొరాకో దేశాలకు కమర్షియల్ షిప్‌మెంట్‌ను కూడా ప్రారంభించింది. 

భారత్ నుంచి వ్యాక్సిన్ షిప్‌మెంట్ తాజాగా బ్రెజిల్‌కు చేరుకుంది. వ్యాక్సిన్ షిప్‌మెంట్ అందిన తర్వాత బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో ఆంజనేయుడు ఫొటోతో భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వ్యాక్సిన్లను సంజీవనిగా ఆయన అభివర్ణించారు.