వైట్‌హౌస్ ఆవరణలో ఏకంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతుండగా ఓ ట్రాన్స్‌జెండర్ నానా రచ్చ చేసింది. టాప్‌లెస్‌లో ఫోజులు ఇస్తూ.. కెమెరాకు ఫోజులు ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతుండగా.. అది కూడా శ్వేత సౌధంలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. సోమవారం వైట్‌హౌస్ ప్రైడ్ మంత్ వేడుకలో రోజ్ మోంటోయా అనే ట్రాన్స్‌జెండర్ ఇన్‌ఫ్లుయెన్సర్ టాప్‌లెస్‌గా నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. వైరల్ అవుతున్న టిక్ టాక్ వీడియోను బట్టి ..సదరు ఇన్‌ఫ్లూయెన్సర్ ఫస్ట్ లేడీ జిల్ బైడెన్‌ను కలుసుకుంది. అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కరచాలనం చేస్తూ, కెమెరాకు చిత్ర విచిత్రంగా ఫోజోలు ఇవ్వడం చూడొచ్చు. అంతేకాదు.. ట్రాన్స్ హక్కులూ ,మానవ హక్కులేనంటూ మాంటోయా కెమెరా వైపు చూస్తూ వ్యాఖ్యానించింది.
వైట్‌హౌస్ ముందు మోంటోయా వరుసగా ఫోజులు ఇస్తున్న క్లిప్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీటిని సాంప్రదాయవాదులు ఖండిస్తున్నారు. బైడెన్ పక్కన బయోలాజికల్ ఫిమేల్ టాప్‌లెస్‌గా వుందని, రొమ్ములను శస్త్రచికిత్స ద్వారా తొలగించుకుందని టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ సీఈవో చార్లీ కిర్క్ ట్వీట్ చేశారు. నేషనల్ రివ్యూ కంట్రిబ్యూటర్ ప్రదీప్ జే శంకర్ సైతం ట్రాన్స్‌జెండర్‌పై భగ్గుమన్నారు. 2024 ఎన్నికల కోసం ఇదో పబ్లిసిటీ స్టంట్‌గా ఆయన అభివర్ణించారు. జార్జియా, ఒహియో, మిచిగాన్, విస్కాన్సిన్, అయోవాలో ఇది నడుస్తుందని భ్రమపడుతున్నారని శంకర్ చురకలంటించారు.
కాగా.. జూన్ 10 శనివారం నాడు వైట్‌హౌస్ లాన్‌లో బైడెన్ ప్రైడ్ మంత్ వేడుకను నిర్వహించారు. సాంప్రదాయవాద రాష్ట్ర శాసనసభల నుంచి దాడికి గురవుతున్నట్లు వైట్‌హౌస్ ఆరోపిస్తున్న స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్లకు సంఘీభావం తెలియజేయానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
