రష్యా సైన్యాలను అడ్డుకోవడానికి ఉక్రెయిన్ జవాన్లు వీరోచిత సాహస కృత్యాలు చేస్తున్నారు. క్రిమియా నుంచి ఉక్రెయిన్‌లోకి వస్తున్న రష్యా ఆర్మీని అడ్డుకోవడానికి ఓ ఉక్రెయిన్ జవాన్ ఏకంగా బ్రిడ్జీని పేల్చేయాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలో ఆ జవాన్ తనను తానూ పేల్చేసుకోవాల్సి వచ్చింది.
హైదరాబాద్: మాతృ భూమిని కాపాడుకోవడానికి ఆ బిడ్డలు ప్రాణలను తృణప్రాయంగా వదిలేస్తున్నారు. శత్రు సైన్యాలను ఆపడమే లక్ష్యంగా ఎంతటి సాహసోపేత చర్యలైనా వెనుకడుగు వేయకుండా చేసి తీరుతున్నారు. రష్యా సైన్యాన్ని ఎదుర్కోవడానికి ఉక్రెయిన్(Ukraine)లో పండు ముదుసలి వాళ్ల వరకూ పోరాడతామని ముందుకు రావడం అంతటా చర్చనీయాంశం అవుతున్నది. ఇక ఉక్రెయిన్ సైన్యం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా, రష్యా(Russia) సైన్యాన్ని(Army) ఆపడానికి ఆ ప్రాంతంలోని ఏకైక బ్రిడ్జీని ఎలాగైన పేల్చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జవాన్(Jawan) తన ప్రాణాలనూ లెక్కచేయలేదు.
రష్యా గతంలో క్రిమియా అనే ప్రాంతాన్ని ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. రష్యా ఉక్రెయిన్‌కు చేరడానికి క్రిమియా నుంచి కీలక మార్గంగా ఓ బ్రిడ్జీ అనుసంధానంతో ఉన్నది. రష్యా ఆర్మీ ఆ బ్రిడ్జీ గుండా ఉక్రెయిన్‌లోకి ప్రవేశించనున్నాయి. కానీ, వారిని ఎలాగైనా ఆపాలని ఉక్రెయిన్ బలగాలు భావించాయి. తద్వార వారి ప్రవేశాన్ని ఆలస్యం చేస్తే.. ఉక్రెయిన్ సైన్యాలకు మరికొంత సమయం చిక్కుతుంది. ఆ సమయంలో వారు పొజిషన్‌లు, వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరింపులు జరుపవచ్చు. అందుకే ఆ బ్రిడ్జీని పేల్చి రష్యా సైన్యాన్ని అడ్డుకోవాలని భావించాయి.
ఉక్రెయిన్ మిలిటరీ ప్రకటన ప్రకారం, రష్యా సేనలు తమ దేశంలోకి అన్ని వైపులా నుంచి ప్రవేశిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు సంబంధించి చాలా జటిలమైన ప్రాంతం క్రిమియాతో కలిసే ప్రాంతమే. ఈ ప్రాంతం నుంచి రష్యా సేనలు దేశంలోకి ప్రవేశించే యత్నం చేశాయి. ఆ భారీ ఆర్మీ కాన్వాయ్‌ను అడ్డుకోవడానికి జెనిచ్ కార్ బ్రిడ్జీని పూర్తిగా కూలదోయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి ఓ వేరే సెయిలర్ బెటాలియన్‌కు చెందిన ఇంజినీర్ షకున్ విటాలి వొలొడిమిరోవిచ్‌కు అప్పజెప్పారు. ఆ బ్రిడ్జీని ఆయన రిప్లేస్ చేయగలిగాడు. కానీ, అక్కడి నుంచి ఆయన ఎస్కేప్ అయ్యే సమాయం దక్కలేదు. అక్కడ ఇంకొన్ని క్షణాల్లో బాంబు పేలిపోనుంది. ఆ పేలుడు నుంచి తాను బయట పడబోనని ఆ జవాను రియలైజ్ అయ్యాడు. దీంతో ఆయన అక్కడే ఉండిపోయాడు.
ఈ పేలుడులో తమ జవాను షకున్ విటాలి వొలొడిమిరోవిచ్ దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. ఆయన చేసిన పనితో రష్యా బలగాల ప్రయాణం ఆలస్యం అయిందని, తద్వార తమ జవాన్లకు వ్యూహాత్మక సమయం చిక్కిందని ఉక్రెయిన్ ఆర్మీ వర్గాలు తెలిపాయి. తమ ప్రాణాలు ఉన్నంత కాలం పోరాడుతూనే ఉంటామని ఆ ఆర్మీ ప్రకటన ముగిసింది.
కీవ్‌లోకి రష్యా సేనలు ప్రవేశిస్తున్న నేపథ్యంలో రాజధాని నగరం నుంచి ప్రజలను తరలించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా తెలిపింది. తాము ఉక్రెయిన్‌కు హెల్ప్ చేయడానికి రెడీ అని వివరించింది. ఇదే ఆఫర్ అమెరికా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీకి ఇచ్చింది. కానీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు అమెరికా ఆఫర్‌ను తిరస్కరించారు. ‘ఇక్కడ పోరాటం జరుగుతున్నది. మాకు పేలుడు పదార్థాలు, ఆయుధాలు కావాలి. అంతేకాదు.. రైడ్ కాదు’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ చెప్పినట్టు అమెరికాకు చెందిన సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు వెల్లడించారు. వొలొడిమిర్ జెలెన్‌స్కీ యుద్ధం ఒత్తిడిలో లేరని, ఆయన పోరాటాన్ని విజయవంతం చేయాలనే ఆరాటంలో ఉన్నారని పేర్కొన్నారు.
