కరోనా వైరస్‌తో ప్రపంచాన్ని పెను సంక్షోభంలో నెట్టిన చైనాలో మరో బ్యాక్టీరియా అక్కడి ప్రజలను భయపెడుతోంది. వాయువ్య చైనాలోని కొన్ని వేల మంది ప్రజలు బ్రూసెలోసిస్ అనే వ్యాధి బారినపడుతున్నారు.

ఇది ఒక రకమైన బ్యాక్టీరియా కారణంగా వ్యాప్తి చెందుతోందని అక్కడి వైద్యులు చెబుతున్నారు. చైనా అధికారులు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. గతేడాది ఓ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ నుంచి లీకయిన బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది.

పశువులపై వుండే బ్రూసెల్లా అనే బ్యాక్టీరియా కారణంగా ఈ వ్యాధి వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. గన్సు ప్రావిన్స్ రాజధాని లాన్జౌలో ఈ బ్యాక్టీరియా ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతున్నట్లు అధికారలు వెల్లడించారు.

ఈ వ్యాధి సోకిన వారిలో శరీర భాగాల్లో వాపు, వృషణాలు ఎర్రబడటం, సంతానానికి పనికిరాకుండా పోవడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. ఇప్పటి వరకు 3,245 మందికి బ్రూసెలోసిస్ వ్యాధి వచ్చినట్లు లాన్జౌ ఆరోగ్య కమీషన్ ప్రకటించింది.

అటు అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) కూడా ఈ వ్యాధి వ్యాప్తిపై ప్రకటన చేసింది. ఈ బ్యాక్టీరియా కారణంగా మాల్టా ఫీవర్ లేదా మెడిటేరియన్ ఫీవర్ వస్తోందని సీడీసీ నిపుణులు చెబుతున్నారు.

బ్రూసెల్లా వల్ల తలనొప్పి, కండరాల నొప్పి, జ్వరం, అలసట వస్తాయని.. ఈ లక్షణాలు తగ్గినా, మరికొన్ని దీర్ఘకాలంగా వేధించే ప్రమాదం వుందట. అలాగే ఈ బ్యాక్టీరియా కారణంగా శరీర భాగాల్లోని కొన్ని చోట్ల ఏర్పడే వాగు ఎప్పటికీ పోదట. ఈ వ్యాధిలో మనుషులకు సోకడం, ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడం చాలా అరుదని సీడీసీ చెబుతోంది.

కుళ్లిపోయిన, పాడైపోయిన ఆహారాన్ని తీసుకోవడం, శ్వాస తీసుకున్నప్పుడు శరీరంలోకి బ్యాక్టీరియా వెళ్లడం ద్వారా బ్రూసెలోసిస్ వ్యాపించే అవకాశం ఉందని సీడీసీ చెబుతోంది.