Russia Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్​ మధ్య  జ‌రిగిన మూడో విడ‌త శాంతి చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. అయితే బెలారస్ వేదిక జరిగిన చర్చల్లో మానవతా కారిడార్ల విషయంలో కొంత పురోగతి సాధించినట్లు ఉక్రెయిన్‌ తెలిపింది. 

Russia Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్​ మధ్య సోమవారం జరిగిన మూడో విడత శాంతి చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే .. అర్థంత‌రంగా ముగిశాయని ఇరుదేశాల ప్ర‌తినిధులు తెలిపారు. కానీ, ఉక్రెయిన్ లో మానవతా కారిడార్ల ఏర్పాటులో కొంత పురోగతి సాధించినట్లు మైఖైలో పోడోల్యాక్ ఉక్రెయిన్ ప్రతినిధి బృందం సభ్యుడు తెలిపారు. కాల్పుల విరమణ, భద్రతా పరమైన హామీలతో పాటు వివాదాల పరిష్కారం కోసం తీవ్రమైన సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఆయన ట్వీట్​ చేశారు.

బెలారస్ వేదిక‌గా సోమవారం జరిగిన మూడో రౌండ్ శాంతి చర్చల్లో ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి రాక‌పోవ‌డంతో విఫలమయ్యాయి. ఈ చ‌ర్చ‌ల్లోరాజకీయ, సైనిక అంశాలపై సుధీర్ఘ చర్చలు కొనసాగాయి. అయితే.. ఇరు దేశాల ప్ర‌తినిధులు ఏకాభిప్రాయానికి రాక‌పోవ‌డంతో చ‌ర్చ‌లు అసంపూర్ణంగా నిలిచాయి. ఎలాంటి సానుకూల అంశాలు లేవనే సంకేతాలిచ్చారు. దాడులు ఆగ‌వని తెలిపారు.

పౌరుల తరలింపు సమస్యను ఇరుపక్షాలు ప్రస్తావించగా, మానవతా కారిడార్లు మంగళవారం నుంచి ప్రారంభిస్తామని ఉక్రెయిన్ కు రష్యా హామీ ఇచ్చిందని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయ అధిపతి మైఖైలో పోడోలియాక్ చెప్పారు. మానవతా కారిడార్‌ల లాజిస్టిక్స్‌ను మెరుగుపరిచే విషయంలో కొంత సానుకూల పురోగతి ఉందని పోడోలియాక్ చర్చల తర్వాత ట్వీట్ చేశారు. మూడో విడ‌త చ‌ర్చ‌ల్లో గణనీయంగా ఫలితాలు లేవు. అయినప్పటికీ, సంప్రదింపులు కొనసాగుతాయని పోడోలియాక్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ట్విట్టర్‌లో వీడియో సందేశాన్ని పోస్టు చేశారు. 


ఇదిలాఉంటే.. ఉక్రెయిన్‌ పై రష్యా సైనిక చ‌ర్య ప్రకటించి నేటికి 13 రోజులు. రష్యా దాడులతో ఉక్రెయిన్ విలవిలలాడుతోంది. ఇప్ప‌టికే ప‌లు న‌గరాలను ధ్వంసం చేసిన ర‌ష్యా సైన్యాలు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌ని ర‌ష్యా తీవ్రంగా ప్ర‌యత్నిస్తున్నాయి. అయితే, ఉక్రేనియన్ బ‌లగాలు కూడా చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. ఈ క్రమంలో ఎటు చూసినా.. బాంబు పేలుళ్లు, మిసెల్స్ దాడులు.. భీతావహ పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే.. ఉక్రెయిన్ న‌గ‌రాలు.. శ్మశానాల్లా మారాయి. ఎక్క‌డ చూసినా.. శ‌వాలు.. ర‌క్తపుటేరు. దీంతో ఇక్క‌డి ప్ర‌జ‌లు ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని కాలం వెల్ల‌దీస్తున్నారు. మ‌రో కొంద‌రూ దేశం విడిచి పారిపోతున్నారు.

గ‌త రెండు వారాల్లో దాదాపు 1.7 మిలియన్ల మంది ఉక్రెయిన్ ప్రజలు దేశం విడిచి పారిపోయారని UN శరణార్థి ఏజెన్సీ ప్ర‌క‌టించింది. ఫిబ్రవరి 24న రష్యా పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించినప్పటి నుండి 1,735,068 మంది ప్రజలు ఉక్రెయిన్ నుండి పారిపోయారని తెలిపింది. వీరిలో దాదాపు సగం మంది పిల్ల‌లు, యువకులేనని UNICEF అభిప్రాయపడింది. ఓ వైపు శాంతి చ‌ర్చ‌లు జ‌రుపుతూనే.. కాల్పు విరమణ అంటూనే ర‌ష్యా యుద్ధాన్ని కొనసాగించింది. రష్యా సైనిక బలగాలు రాజధాని కీవ్ లోని మకారివ్‌ ప్రాంతంలోని రాకెట్‌ లాంఛర్లు, బాంబులతో విరుచుకుపడింది. ఈదాడుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోగా, 30 మంది గాయపడ్డారు.