అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ విచిత్రమైన దొంగతనం జరిగింది. చెబితే వింతగా ఉంటుంది కానీ నష్టం తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే. దొంగలు గ్లౌజులు దొంగిలించారు. ఒకటో, రెండో కాదు 60 లక్షల గ్లౌజులను కొట్టేశారు. వీటి విలువ మిలియన్ డాలర్లని అధికారులు అంటున్నారు. వివరాల్లోకి వెడితే..

కరోనా నేపథ్యంలో గ్లౌజులకు డిమాండ్ బాగా పెరిగింది. గ్లౌజులను సరఫరా చేసే కోరల్ స్ప్రింగ్స్ లోని మెడ్ గ్లవ్ అనే సంస్థ గత శుక్రవారం గ్లౌజులను తెప్పించింది. వైద్యపరంగా అత్యంత భద్రమైనవనిగా గుర్తింపు ఉన్న ఈ గ్లౌజుల కొరకు అనేక ఆస్పత్రులు ఆర్డర్లు వచ్చాయిట. దీనికోసం కంటెయినర్ తెప్పించారు. 

శుక్రవారం రాత్రి వచ్చిన కంటెయినర్ నుంచి ఆదివారం రాత్రి దుండగులు ఓ ట్రక్కులో గ్లౌజులను నింపుకుని వెళ్లిపోయారు. ఇదంతా నిమిషాల్లో జరిగిపోయింది. ఇదంతా అక్కడున్న సీసీ కమెరాల్లో రికార్డ్ అయ్యింది. 

దీనిపై మెడ్ గ్లవ్ ఉపాధ్యక్షుడు రిక్ గ్రైమ్స్ మాట్లాడుతూ.. ఇది షాకింగ్ గా ఉందని, కోట్ల విలువైన గ్లౌజులు దొంగల బారిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్లౌజుల కోసం అనేక ఆస్పత్రులు రోజువారీగా తమ నుంచి కొనుగోలు చేస్తారని వెల్లడించారు.