కరోనా మహమ్మారి.. ఇప్పుడు ఎక్కడ విన్నా.. ఇదే పేరు వినపడుతోంది. ప్రజలు ఈ పేరు చెబితేనే భయపడిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా హడలెత్తిస్తున్న ఈ వైరస్ కి సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. 2019, న‌వంబ‌రు 17న వూహాన్‌లో వెలుగు చూసిన ఈ వైర‌స్‌.. అత్యంత వేగంగా ప్ర‌పంచాన్ని చుట్టేసింది. కంటికి క‌నిపించ‌కుండా.. కుళ్ల‌బొడిచేసింది. సెలబ్రెటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా అందరికి సోకి అల్లకల్లోలం చేస్తోంది.

అంతేకాదు.. ఈ ఏడాది కాలంలో క‌రోనా.. ప్రపంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేసింది. అగ్ర‌రాజ్యం అమెరికాలో ట్రంప్‌ ప్ర‌భుత్వాన్ని ప‌డేసిన కార‌ణాల్లో క‌రోనా కూడా ఒక‌టంటే.. ఆశ్చ‌ర్యం క‌లిగించ‌క మాన‌దు. ప్రపంచ దేశాల్లో 5జీ సేవలు, ఫాస్టెస్ట్  టెక్నాల‌జీ వ‌చ్చినా.. సుదీర తీరాల్లోని వ్య‌క్తులు ఆన్‌లైన్‌లో సెక‌న్ల వ్య‌వ‌ధిలో క‌లుసుకునే వ్య‌వ‌స్థ అందుబాటులోకి వ‌చ్చినా.. క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి మాత్రం ఈ సాంకేతిక ఏమీ ప‌నిచేయ‌లేక పోయింది. అంతేకాదు.. ఏడాది గ‌డిచినా.. నియంత్ర‌ణే త‌ప్ప‌.. నివార‌ణ లేని వైర‌స్‌గా విజృంభిస్తోంది.

ఒక‌టి కాదు.. రెండు కాదు.. ప్ర‌స్తుతం మూడో ద‌శ‌లో కూడా క‌రోనా ప్ర‌పంచాన్ని కాటేస్తోంద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక‌, క‌రోనా క‌ట్ట‌డికి అన్ని దేశాలు క‌లిసి.. ప‌నిచేస్తున్నా.. ఫ‌లిత‌మూ క‌నుచూపు మేర‌లో క‌నిపించ‌డం లేదు. వ్యాక్సిన్ తయారీకి వేల కోట్ల‌ను ఖ‌ర్చు చేస్తున్నా.. అదిగో .. వ్యాక్సిన్‌.. ఇదిగో వ్యాక్సిన్ అనిచెప్పుకోవ‌డానికే ప‌రిమిత‌మైంది.. త‌ప్ప‌.. ప్ర‌త్య‌క్షంగా అందుబాటులోకి ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు. మ‌రో.. నాలుగు నెల‌ల వ‌ర‌కు వ‌చ్చే ప‌రిస్థితి కూడా క‌నిపించ‌డం లేదు. 

ఇప్పటి వరకు 55 మిలియన్ల జనాభాకు కరోనా సోకగా 35.2మిలియన్ల మంది కోలుకున్నారు. 1.33 మిలియన్ల మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రజల జీవన విధానంలో కరోనా సరికొత్త మార్పులు కూడా తీసుకొచ్చింది. ఉరుకుల పరుగుల జీవితం నుంచి ఊరటనందించింది. మనుషుల మధ్య విలువలను, బంధాలను నేర్పించిందని చెప్పవచ్చు. అలాగే వ్యక్తిగత శుభ్రతను బోధించింది. అయితే.. దీనికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ మాత్రం ఎవరూ కనిపెట్టలేకపోయారు.