గుహలో ఏం జరిగిందన్నది చెప్పకండి.. 12మంది పిల్లలకు అధికారుల ఆదేశం

Thailand cave rescue: children discharged from hospital on thursday
Highlights

ఇంటికి వెళ్లిన తర్వాత గుహలో ఏం జరిగింది.. ఇన్ని రోజుల ఆ క్లిష్ట పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారు.. తదితర అంశాల గురించి మీడియాకు ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని అధికారులు పిల్లలకు వారి తల్లిదండ్రులకు సూచించారు.

15 రోజుల పాటు గుహలో నరకం అనుభవించి.. ప్రాణాలతో బయటపడిన 12 మంది థాయ్‌లాండ్ చిన్నారులు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. వీరిని గురువారం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి చేస్తామని థాయ్ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఇంటికి వెళ్లిన తర్వాత గుహలో ఏం జరిగింది.. ఇన్ని రోజుల ఆ క్లిష్ట పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారు.. తదితర అంశాల గురించి మీడియాకు ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని అధికారులు పిల్లలకు వారి తల్లిదండ్రులకు సూచించారు.

ఇంటర్య్యూలు ఇస్తే వారు గడిపిన భయానక పరిస్థితులు మళ్లీ మళ్లీ గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుందని.. అది వారిని మానసికంగా మరింత కృంగదీస్తుందని అధికారులు తెలిపారు. గత నెల 23న గుహలోకి వెళ్లిన ఇన్ని రోజులు ఎలా గడిపారు.. ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారనే విషయాన్ని తెలుసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టే వారిని ఇంటర్వ్యూలు చేసేందుకు వివిధ మీడియా సంస్థల ప్రతినిధులు పిల్లలు చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్దా.. వారి ఇళ్ల వద్దా పడిగాపులు కాస్తున్నారు.

తమ జట్టులోని ఒక ఆటగాడి పుట్టినరోజు వేడుకలు సెలబ్రెట్ చేసేందుకు గాను.. గత నెల 23న ఫుట్‌బాల్ కోచ్ సహా.. 12 మంది బాలలు థామ్ లువాంగ్ గుహల్లోకి వెళ్లి.. అందులో చిక్కుకుపోయారు. వీరిని సురక్షితంగా బయటకి తెచ్చేందుకు గాను థాయ్‌లాండ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన సహాయక బృందాలు తీవ్రంగా కృషి చేశాయి.

loader