అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన అధికారంలో ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలే  ఓటమికి కారణమయ్యాయి. అయితే.. ఇప్పటికీ ఆయనను అభిమానించేవారు చాలా మందే ఉన్నారు. ద్వేషించేవారు కూడా చాలా మందే ఉన్నారు.

కాగా.. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తన టెంపరీతనంతో ఎంతమంది అభిమానులను సంపాదించుకున్నారో, అంతేమంది విరోధులను కూడా కూడగట్టుకున్నారు ట్రంప్. ఇప్పటికీ ఆయనపై కొందరు అమెరికన్లకు ఇంకా కోపం తగ్గలేదు. అందుకే టెక్సాస్​లోని శాన్ ఆంటోనియోలో ఉన్న లూయిస్​ టుస్సాడ్స్​ వ్యాక్స్​వర్క్స్​లోని ట్రంప్ మైనపు​ విగ్రహంపై అక్కడికి వచ్చే కొందరు పంచ్‌ల వర్షం కురిపిస్తున్నారట.

ప్రధానంగా ఆయన మొహంపై పిడిగుద్దులతో విరుచుకుపడుతున్నారట. దాంతో చేసేదేమిలేక ట్రంప్​ మైనపు బొమ్మను నిర్వాహకులు వేరే చోటకు తరలించారు. ఈ విషయాన్ని లూయిస్​ టుస్సాడ్స్​ వర్క్స్​ను నిర్వహించే రిప్లే ఎంటర్​టైన్​మెంట్స్​ ప్రాంతీయ మేనేజర్ క్లే స్టీవర్ట్ వెల్లడించారు. గతంలో మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్​ వాషింగ్టన్ బుష్​ విగ్రహాలపై సైతం ఇలాంటి దాడులే జరిగాయని ఆయన గుర్తు చేశారు. దీంతో ఒబమా విగ్రహం చెవులు ఆరుసార్లు పోయాయట. అలాగే ​బుష్​ మైనపు బొమ్మ ముక్కును కూడా కొందరు విరగ్గొట్టారని స్టీవర్ట్ తెలిపారు.